బాలరిష్టాలు అధిగమించాం

C

 

అభివృద్ధిలో ముందున్నాం

– మైనారీటీ, ఎస్టీలకు దామాశ పద్దతిలో రిజర్వేషన్లు

– ప్రతిష్టాత్మక గోల్కొండ నుంచి సీఎం కేసీఆర్‌ పంద్రాగస్టు సందేశం

హైదరాబాద్‌,ఆగస్టు 15(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ది ఇప్పడు దేశాన్ని ఆకర్శిస్తోందని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో దేశం దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోందని, సంక్షేమ రంగంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. దసరా పండుగకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు ఉంటాయని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఈ మేరకు కమటిలను వేశామని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వ పని తీరును ప్రధాని మోడీ ప్రశంసించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షించాయని.. రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశంసించడం మనలో స్ఫూర్తి నింపిందన్నారు. సమాఖ్య స్ఫూర్తితో కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలతో సత్ఫలితాలు పొందుతున్నామన్నారు. బాలారిష్టాలు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ.. స్థిర పాలన అందిస్తున్నామన్నారు.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మూడోసారి వేడుకలను కూడా గోల్కొండలోనే జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని  ముందుకు తీసుకువెళుతున్నామన్నారు.ఇంటింటికీ తాగు నీటి పథకాన్ని ప్రధాని మోడీ చేతుల విూదుగా ప్రారంభించాం. మిషన్‌ భగీరథ పనుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మంచినీటితో పాటు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో సన్నిహితంగా ఉంటున్నాం. రామగుండం ఫెర్టిలైజర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణతో ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నీటి పారుదల, విద్యుత్‌ రంగంలో ఇతర రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. సత్సంబంధాలతో సత్ఫలితాలు సాధిస్తున్నాం. ఛత్తీసగఢ్‌ నుంచి నాలుగు నెలల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ అందుతుంది. అందుకు సంతోషిస్తున్నాం. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ నెల 23న ముంబయిలో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంటాం. కర్ణాటక ప్రభుత్వంతో స్నేహసంబంధాలు బలపడ్డాయి. ఆర్డీఎస్‌ పనులు వేగవంతం చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సహకరిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేస్తాం. పాలమూరు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం. కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం. కల్యాణలక్ష్మీ పథకం బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తున్నాం అని సీఎం తెలిపారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద బ్రాహ్మణులకు బడ్జెట్లో వందకోట్లు కేటాయించినట్లు చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీ, ఎస్టీ, మైనార్టీలకు త్వరలో 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. 2019నాటికి మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పరిధిలో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. 2303 పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి  రూ.46వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం లుంబినీ పార్కులో అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు దసరా కానుకగా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోందని, ఆ రోజు నుంచే కొత్త జిల్లాలు పని చేస్తాయని ప్రకటించారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా 46వేల చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని.. రైతుకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేసిందన్నారు. మైక్రో ఇరిగేషన్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచేందుకు రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు అందజేస్తోందన్నారు. రైతులు తమ పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు వీలుగా తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో 177 గోదాములు ఉండగా తమ ప్రభుత్వం 330 గోదాముల నిర్మాణాలకు చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ముందుగా 100 గోదాముల నిర్మాణానికి పూర్తిస్థాయి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మైక్య రాష్ట్రంలో తెలంగాణలో విద్యుత్‌ కొరత ఉండేదని… త్వరలో ప్రతి గ్రామానికి పూర్తిస్థాయి విద్యుత్‌ను అందిస్తామన్నారు. రూ.600కోట్ల వ్యయంతో ఆస్పత్రుల్లో నూతన వైద్య సామాగ్రి సమకూర్చనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లకు బడ్జెట్‌ రెట్టింపు చేసినట్లు తెలిపారు. టీఎస్‌ ఐపాస్‌ పథకం ద్వారా తమ ప్రభుత్వం ఎన్నో పరిశ్రమలకు అనుమతి ఇచ్చిందని.. దీని ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు. 13.26 వృద్ధి శాతంతో దేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీ కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణ కాలుష్యంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొందని.. దీనిని నివారించేందుకు తమ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని కేసీఆర్‌ తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 46కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని.. వాటిని చంటి బిడ్డల్లా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు పనితీరును కేసీఆర్‌ అభినందించారు. రాష్ట్రపతి శౌర్య పోలీసు పతకాలు పొందిన వారికి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. నీటిపారుదల, విద్యుత్‌, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తున్నామని వివరించాం. సంక్షేమ రంగంలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని  అన్నారు. నీటిపారుదల, విద్యుత్‌, వ్యవసాయ, సంక్షేమ రంగాల్లో సత్ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోతలు లేని విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. పోలీసుశాఖలో సంస్కరణలు చేపట్టాం. పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయస్థాయిలో సెంట్రల్‌ కమాండింగ్‌ సిస్టంతో శాంతి భద్రతల పర్యవేక్షణ. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంస్కరణలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంస్కరణలు చేపట్టామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణలో సంస్కరణలు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కొక్క బెడ్‌ నిర్వహణకు ప్రతి నెల సగటున రూ. 6 వేలు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలోని మొత్తం 42 ఏరియా ఆస్పత్రులకు గానూ 30 ఆస్పత్రుల్లో కొత్త బెడ్లు, కొత్త పరుపులు, కొత్త స్లైన్‌ స్టాండ్లు సమకూర్చడం జరిగింది. మిగతా 12 ఆస్పత్రులకు 20 రోజులు బెడ్లు, పరుపులు, స్లైన్‌స్టాండ్స్‌ సమకూర్చుతాం. రూ. 600 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొత్త సామాగ్రి కొనడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలిసిస్‌ సెంటర్లు, 40 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. మరో రెండు నెలల్లో డయాలిసిస్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతి చెంది వారిని ప్రభుత్వ అంబులెన్స్‌ల్లోనే వారి ఇండ్లకు చేర్చుతాం. త్వరలోనే అంబులెన్స్‌లు అందుబాటులోకి వస్తాయి’ అని సీఎం తెలిపారు. ఈ  కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.