బాలల సంక్షేమం కోసం.. ప్రభుత్వం కట్టుబడి ఉంది
– బాలల చట్టాల సమర్థ అమలుకు కృషి
– భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించిన తప్పక శిక్షిస్తాం
– మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, నవంబర్14 (జనం సాక్షి) : బాలల హక్కులు, వారి సంక్షేమం కోసం తెరాస ప్రబుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్బంగా గురువారం నగరంలోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. బాలల దినోత్సవం సందర్భంగా బలాలందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాలల హక్కులు, సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బాలల చట్టాలు సమర్థవంతంగా అమలయ్యేలా చేశామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న ఈ రాష్ట్రంలో బాలల హక్కులకు భంగం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా వారిని తప్పక శిక్షిస్తామన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతలు చేసి చూపే ప్రభుత్వమన్నారు. చేయని నేరాలకు బలై ¬మ్స్ లలో అనేక మంది బాలలు ఉన్నారన్నారు. వీరి రక్షణ కోసం స్త్రీ- శిశు సంక్షేమ శాఖ ఒక తల్లి, తండ్రి, గురువు వలె ఉంటుందన్నారు. బాలల చట్టాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ… చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఉందన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపిన బాల, బాలికలకు అవార్డులు ఇచ్చి అభినందించారు. అనంతరం చైల్డ్ లైన్ 1098 పోస్టర్, శ్రామిక వికాస పోస్టర్, బాలల అక్రమ రవాణా నిరోధక సంస్థ పోస్టర్లను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో స్త్రీ-శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ శైలజ, జాయింట్ డైరెక్టర్లు అనురాధ, సబిత యూనిసెఫ్ ప్రతినిధి శ్రీమతి మిట్టల్, అధికారులు పాల్గొన్నారు.