బాలికలకు ఉపయోగపడేలా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్
ఒక్కో కిట్ లో 13 రకాల 50 వస్తువుల పంపిణీ
12 నెలలపాటు ఉపయోగపడేలా కిట్స్ సరఫరా
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కిట్స్ అందించాలని ప్రతిపాదన
100 కోట్ల రూపాయల రాష్ట్ర బ్జడెట్ తో కిట్స్ పంపిణీ
ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్,మే26(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి 8 లక్షల మంది విద్యార్థినిలకు పంపిణీ చేయనున్న హెల్త్ అండ్ హైజీన్ కిట్ లో 13 రకాల 50 వస్తువులు పొందుపర్చినట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ కిట్ లో పతంజలి, డాబర్, జాన్సన్ అండ్ జాన్సన్, ఐటెక్స్ వంటి కంపెనీలకు చెందిన బ్రాండెడ్ వస్తువులే పొందుపర్చామన్నారు. ఈ ఏడాది 100 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, అన్ని గురుకులాల్లోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల బాలికలకు ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశంలో విద్యార్థినిల ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థినిలకు నెలసరి రావడం వల్ల ఆరోగ్యపరంగా బలహీనమవుతున్నారని, పాఠశాలలకు కూడా రాకపోవడం వల్ల విద్యాపరంగా వెనుకబడుతున్నట్లు కేంద్రం నియమించిన క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్(కేబ్) సబ్ కమిటీ చైర్మన్ గా వివిధ రాష్టాల్రు పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దీనికి పరిష్కారంగానే ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కిట్స్ పంపిణీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపాదించామన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించి విద్యర్థినిలకు ఉపయోగపడేలా ఈ కిట్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి పంపిణీ చేస్తోందన్నారు. ఈ కిట్ లో పతంజలి కంపెనీకి చెందిన మూడు ఒంటిసబ్బులు, మూడు బట్టల సబ్బులు, ఒక టూత్ బ్రష్, డాబర్ కంపెనీకి చెందిన కొబ్బరినూనె, షాంపు బాటిల్, టూత్ పేస్ట్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన 30 సానిటరీ న్యాప్కిన్స్, ఐటెక్స్ కంపెనీకి చెందిన పౌడర్,బొట్టు బిల్లలు, ఇతర కంపెనీలకు చెందిన ఒక దువ్వెన, రెండు జడ రబ్బర్లు, రెండు రిబ్బన్లు ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు పదినెలలు నడుస్తున్నా…ఈ కిట్ లను మాత్రం మూడు నెలలకు ఒకటి చొప్పున నాలుగు కిట్స్ అందిస్తున్నామని, దీనివల్ల 12 నెలల పాటు విద్యార్థినులకు కిట్ అందుతుందని తెలిపారు.