బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి:అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ “ప్రస్తుత సమయం మాది – మా హక్కులు మా భవిష్యత్” అనే అంశం తో ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. అవకాశాలు కల్పిస్తే బాలికలు అన్ని రంగాలలో రాణిస్తారని వారు సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. స్వతంత్రంగా తమ కాళ్ళపై తాము నిలబడ్డప్పుడే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారని అందుకుగాను ఉన్నత విద్య ఒకటే మార్గమని, కాబట్టి బాలికలు సమాజంలోని పరిస్థితులను అధిగమించి నూతన ఆలోచనా విధానంతో , నమ్మకంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బాలికలు ఆటలు, వ్యాయామం ద్వారా శారీరక దృడత్వాన్ని, చదువు ద్వారా ఆర్థిక, సామాజిక ఎదుగుదలను సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వము కూడా మహిళల విద్యాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకొని ఒక శాస్త్రవేత్త, ఒక డాక్టర్, పి .వి.సింధు, మేరీ కోమ్ లా అన్ని రంగాలలో ప్రతిభ కనబరచాలని అన్నారు. నేటి అమ్మాయిలే రేపటి అమ్మలుగా మారుతారని వారు చదువుకుంటేనే వ్యవస్థ బాగుంటుందని, అమ్మగా సమాజానికి మంచిప్రవర్తన, నడవడిక గల పౌరులను అందించవలసిన భాద్యత మీపై ఉందన్నారు.నేటి సమాజంలో బాలికలు లింగ అసమానతలు ఎదుర్కొంటున్నారని, విద్య, పోషణ, హింస, బాల్యవివాహాలు, లైంగిక , శారీరక వేధింపులకు గురవుతున్నారని, బాలికల సంరక్షణపై గ్రామాస్టహాయి నుండి ప్రజలను చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. బాలికలు, మహిళలు తమ హక్కులు, రక్షణ కోసం కోసం ప్రభుత్వం చేసిన చట్టాలు తెలుసుకోవాలని, ఏదైనా సమస్య ఎదురైతే 1098 కాల్ సెంటర్ కు ఫోన్ చేయాలని సూచించారు.
జిల్లా మహిలా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ చదువుతో పాటు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆడపిల్లలు సరైన పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. 10 వ తరగతితో చదువు ఆపేయకుండా ఉన్నత చదువులు చదవాలని, 18 సంవత్సరాల తరువాతే వివాహం చేసుకోవాలని సూచించారు.
అనంతరం వివిధ అంశాలలో గెలుపొందిన విజేతలకు ప్రతిమ సింగ్ జ్ఞాపికలు అందజేశారు.
జిల్లా మైనారిటీ అధికారి జెంలా నాయక్ మాట్లాడుతూ భేటీ బచావో భేటీ పడావో అనే నినాదంతో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని అన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే అన్ని విషయాలపై అవాహాగానా పెంపొందించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయనిర్మల, కళాశాల ప్రధానాచార్యులు కవిత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతిఇనిది, విద్యార్థినులు , అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.