‘బాలిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి…’

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : ఆదిలాబాద్‌ జిల్లా  శ్రీరాంపూర్‌ ఓసీపీ పేలుళ్ల ప్రభావంతో ప్రాణాలో కోల్పోయిన అసంపల్లి రోజా(11) కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని. పలు ప్రజాసంఘాలు పెద్దపెట్టున డిమాండ్‌ చేశాయి. ఈ నెల 16న శ్రీరాంపూర్‌ ఓసీపీలో నిత్యం చెలరేగే పేలుళ్ళతో సింగాపురం గ్రామంలో ఓ నిరుపేద కూలీకుటుంబానికి చెందిన పెకుంటిల్లు నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో రోజా మృతిచెందగా ఆమె సోదరుడు మారుతి (6) తీవ్రగాయాల పాలయ్యారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ ఉద్యోగుల సంఘం, అసంఘటిత కార్మికుల సంఘం, నిరుద్యోగుల సంఘం, విద్యావంతుల వేదిక, ప్రజాఫ్రంట్‌, డీటీఎఫ్‌, భూమి రక్షణ సంఘం, పౌరహక్కుల సంఘం, తెలంగాణ లిబరేషన్‌, తెలంగాణ రచయితల వేదిక తదితర సంఘాలతో సమ్మేళనమైన సింగరేణి భూనిర్వాసితుల హక్కుల రక్షణ కమిటి రోజా కుటుంబాన్ని సందర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. ఓసీపీ పేలుళ్లతో గ్రామంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలం గాణ రచయితల వేదిక, భూమి రక్షణ సంఘం బాధ్యురాలు ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత మాట్లాడుతూ ఈ సంఘటనపై రాజకీయపక్షాలు కానీ, యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం బాధకరమన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద యాజమాన్యంపై కేసు నమోదు చేయాలన్నారు. కుటుంబంలో ఒకరికి సింగరేణి యాజమాన్యం ఉద్యోగం కల్పించాలన్నారు. బ్లాసింగ్‌లో గాయపడ్డ మారుతికి వైద్యసహాయం అందించాలన్నారు. ఓసీపీల వల్ల తలెతుత్తున్న సమస్యలను నిరోధించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతస్థాయిలో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్శన బృందంలో ప్రజాసంఘాల నాయకులు నేరేటి రాజన్న, సంజీవ్‌, జగన్మోహన్‌రావు, మార్వాడి సుదర్శన్‌, మాదన కుమారస్వామి, ఏనుగు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు