బాల సైంటిస్ట్‌ అహ్మద్‌కు అపూర్వ గౌరవం

3

– గూగుల్‌ ఫేర్‌కు ఆహ్వానం

– అరెస్టైన చోటే అత్యున్నత శిఖరం

హైదరాబాద్‌సెప్టెంబర్‌22(జనంసాక్షి):

సొంతంగా తయారుచేసిన గడియారాన్ని చూసి బాంబు అనుకుని అమెరికాలో ఓ 14ఏళ్ల బాలుడిని గతవారం పొరబాటుగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బాలుడికి ప్రఖ్యాత గూగుల్‌ ఫెయిర్‌ నుంచి ఆహ్వానం లభించింది. వివరాల్లోకి వెళితే…టెక్సాస్‌కు చెందిన అహ్మద్‌ ఇర్వింగ్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంజినీరింగ్‌ అంటే మక్కువ కలిగిన అహ్మద్‌ పెన్సిల్‌ కేస్‌తో తానే సొంతంగా గడియారాన్ని తయారుచేశాడు. అది తన టీచర్‌కు చూపించేందుకు స్కూల్‌కు తీసుకెళ్లాడు. అయితే గడియారం నుంచి శబ్దం రావడం గమనించిన మరో టీచర్‌ బాంబు తెచ్చాడనుకొని స్కూల్‌ యాజమాన్యానికి చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. చూడటానికి బాంబులా ఉండటంతో పోలీసులు కూడా అహ్మద్‌ను అరెస్టు చేశారు. దీనిపై అమెరికా సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. దేశాధ్యక్షుడు ఒబామా సహా, ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌, హిలరీ క్లింటన్‌ లాంటి పలువురు ప్రముఖులు అహ్మద్‌కు మద్దతుగా నిలిచి, తన ఆవిష్కరణను అభినందించారు. దీంతో కాలిఫోర్నియాలో జరుగుతున్న గూగుల్‌ ఐదో వార్షిక సైన్స్‌ ఫెయిర్‌లో తన ఆవిష్కరణను ప్రదర్శించాలని అహ్మద్‌కు ఆహ్వానం వచ్చింది. అహ్మద్‌ లాంటి యువత దేశానికి ఎంతగానో అవసరమని, అతను గూగుల్‌ ఫెయిర్‌కు రావడం సంతోషంగా ఉందని గూగుల్‌ ఫెయిర్‌ ప్రతినిధులు తెలిపారు. సాధారణంగా యంగ్‌ సైంటిస్టులు తమ కొత్త ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఉత్తమమైనవాటికి బహుమతులు ఉంటాయి. ప్రదర్శన మొత్తం మీద విజేతగా ఎన్నికైన విద్యార్థికి 50 వేల డాలర్ల ఉపకారవేతనం లభిస్తుంది. పోటీలో ఫైనల్స్‌కి చేరినవారి ప్రాజెక్టులను అహ్మద్‌ సందర్శించాడు. వారంతా అహ్మద్‌ను చూసి గుర్తుపట్టడమే కాక సాదరంగా ఆహ్వానించారు.