బాసరకు అదనపు బస్సులు
ఆదిలాబాద్,అక్టోబర్9(జనంసాక్షి): విజయదశమి,వరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు ట్రిప్పులను పెంచినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. పండుగ సెలవులు అక్టోబర్ 21 వరకు ఉన్నందునప్రజలు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యేందుకు బస్సులను సిద్ధం చేశారు. ప్రజలను తరలించేందుకు అధికారులు అదనపు బస్సులను, ట్రిప్పులను ఏర్పాటు చేయడంతో సాధారణ రోజుల్లో కంటే పండుగ పదిరోజులపాటు ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రభుత్వ కళాశాలలకు, విద్యాసంస్థలకు 15రో జుల పాటు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఉద్యోగ రీత్యా స్థిర నివాసం ఏర్పర్చుకున్న వారు, ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌లో ఉంటున్న యువతీ యువకులు పండుగల సందర్భంగా తమ స్వస్థలాలకు చేరుకుని పండుగ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. పండుగకు 15రోజుల ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. బస్సుల్లో సీట్లు దొరకక ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తుంటారు. పండుగల సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోలలో ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులను అదనంగా నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. డ్రైవర్లు, కండక్టర్లకు కూడా డ్యూటీ చార్ట్‌లు వేశారు.