బాసర అభివృద్దికి మార్గం సుగమం
50కోట్ల నిధులతో ప్రత్యేక కార్యక్రమాలు
అమ్మవారిని దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్,జూలై27(జనం సాక్షి): ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో గురుపౌర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న నవ చండీయాగం పూర్ణాహుతితో పూర్తి చేశారు. గురు పౌర్ణిమ సందర్భంగా బాసర అమ్మవారిని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మూల పురుషుడు, విష్ణు స్వరూపుడైన వేద వ్యాస భాగవణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ బాసర ఆలయ అభివృద్దికి పట్టంకట్టారని, ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసారన్నారు. వేద పాఠాశాల ఆధ్వర్యంలో గోదావరి నదికి హారతి నిర్వహిస్తునందున్న శాశ్వత ప్రతిపాదికన ఏర్పాట్లు చేసేందుకు రూ. 60 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రూ. 50 కోట్లతో బృహత్ ప్రణాళికను రూపొందించి, అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అల్లోల దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ వేడుకలకు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆలయ ఈవో సుదాకర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు హాజరయ్యారు.