బాసర ఆలయానికి మహర్దశ
ఇక ఆలయ విస్తరణకు కార్యాచరణ
నిధుల విడుదలతో మారనున్న రూపురేఖలు
బాసర,జూలై 23(జనంసాక్షి): చదువుల తల్లి సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న బాసర పుణ్యక్షేత్రం మహర్దశ సంతరించుకోనుంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత జిల్లాలో ఉన్న ఆలయం అభివృద్దికి తీసుకున్న చర్యలు కార్యరూపంలోకి రానున్నాయి. ఆలయ విస్తరణకు నిధులు విడుదలయ్యాయి. దీంతో ఆలయం కొత్త శోభను సంతరించుకోనుంది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాసర ఆలయం అభివృద్ధిపై ఆశలు ఏర్పడ్డాయి. పలుమార్లు సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో భక్తులు సంతోషం వ్యక్తమైంది. గత ఫిబ్రవరి చివరి వారంలో ఉమ్మడి జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో పర్యటించిన సీఎం.. బాసర ఆలయాభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జ్ఞానసరస్వతి ఆలయానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఆలయ అభివృద్ధి కోసం రూ పొందించిన దాదాపు రూ.200 కోట్ల వ్యయం గల బృహత్ ప్రణాళిక ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇటీవలే ఇందుకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక ఆలయ ప్రాంగణంలో పను లు ప్రారంభం కావడమే తరువాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటైన నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న సరస్వతీ అమ్మవారి ఆలయానికి ప్రతిరోజూ 10 వేలకు తగ్గకుండా భక్తులు వస్తుంటారు. అక్షర శ్రీకార పూజల కోసం తెలుగు రాష్టాల్ర నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచీ భక్తులు తరలివస్తారు. రోజుకు 300లకుపైగా అక్షర శ్రీకార పూజలు నమోదవుతున్నాయి. వేసవి సెలవులు, ఉత్సవ దినాలు, పరీక్షల రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ సమయాల్లో సరిపోను వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఏడాదికి రూ. 18 కోట్ల వరకు ఆదాయం ఉన్నప్పటికీ ఆలయ నిర్వహణ ఖర్చులకే సరిపోతుంది. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్డెట్‌లో రూ. 50 కోట్లు కేటాయించింది. క్యూకాంప్లెక్స్, ఆల య విస్తరణ, ప్రాకార మంటపం విస్తరణ, అక్షరాభ్యాస మంటపాల విస్తరణ, ప్రసాదాల తయారీ నూత న భవనం, మరో 100 వసతి గదుల నిర్మాణం వంటివి ఉన్నాయి.ఇందుకోసం సుమా రు రూ. 200 కోట్ల వ్యయం గల అభివృద్ధి ప్రణాళికను ప్ర భుత్వానికి 3 నెలల కిందట అధికారులు నివేదించగా.. ఇటీవల ఆమోదం లభించింది. ప్రణాళికలో పేర్కొన్నపనులన్నీ పూర్తయితే భక్తుల కష్టాలు చాలా వరకు తీరనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే దేవాలయాలకు మహర్దశ ఏర్పడుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాదంతా బాగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.రాష్ట్రంలో ప్రాచీన దేవాలయాలకు అత్యధిక నిధులను కేటాయించినట్లు తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో 485 ఆలయాలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నందిగుండం దుర్గామాత ఆలయాలను రూ.కోటితో రెండు కొత్త ఆలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు.