బాసర ఆలయ విస్తరణకు ప్రణాళిక
మంజూరైన నిధులతో బృహత్తర ప్రణాళిక అమలు
నిర్మల్,జూలై28(జనం సాక్షి): బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ విస్తరణ, దర్శనానికి వచ్చే భక్తులసదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు.బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్న సిఎం కెసిఆర్ హావిూ మేరకు రూ.50కోట్లు మంజూరు చేసారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంతో పాటు పుణ్యక్షేత్రంలో మార్పులు, చేర్పులు చేయడం, వాస్తు ప్రకారం నిర్మించేందుకు గాను స్తపతి వల్లి నాయగాం గతంలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక ఇంజినీరింగ్ పనులకు సంబంధించి ఎఫ్‌హెచ్‌డీ కనస్టక్షన్ర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇటీవల పరిశీలించి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50కోట్లతో ఆలయ అభివృద్ధి, మార్పులు, చేర్పులతో ఇతర నిర్మాణాలు, పనులు చేపట్టనున్నారు. ఈ నిధులతో చదువుల తల్లి కొలువై ఉన్న బాసర పుణ్యక్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. యాత్రికులకు అన్ని హంగులు, ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ప్రధాన ఆలయంలోని ఆలయ ప్రాకారం, తూర్పు, పశ్చి మ, ఉత్తర, దక్షిణ నాలుగు దిక్కులా రాజగోపురాల నిర్మాణం, ప్రస్తుతం కోనేరు ఆగ్నేయ దిశలో ఉండగా.. ఈశాన్య భాగంలో నిర్మించనున్నారు. ఆలయ పర్యవేక్షణాధికారి కార్యాలయాన్ని తొలగించి.. వేరే స్థలంలో నిర్మిస్తారు. కొత్తగా వం గదుల నిర్మాణంతో పాటు 10వేల మంది భక్తులకు సరిపడే విధంగా ప్రత్యేక క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. తాగునీటి వ్యవస్థ మెరుగు పర్చేందుకు కొత్తగా సంపులు, ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. ప్రసాదం తయారీ కోసం అధునాతన వంటశాల, యాగశాల నిర్మాణం చేస్తారు. అక్షరాభ్యాస మండపాన్ని పొడగించేలా అదనపు నిర్మాణాలు చేయనున్నారు. ప్రస్తుతం దేవాలయ ఆవరణలో వివిధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు సంబంధించిన అతిథి గృహాలున్నాయి. వీటి మొదటి అంతస్తులో కొత్త గదుల నిర్మాణానికి అనుమతించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో వేచి ఉండేందుకు పది ప్రత్యేక షెడ్లు నిర్మిస్తారు. గోదావరి తీరాన భక్తులు స్నానాలు చేసినప్పుడు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక షెడ్లు, హారతి కార్యక్రమం కోసం మరికొన్ని షెడ్లు, ఆలయ ప్రాంగణంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేస్తారు. వాహనాల పార్కింగ్‌కు వీలుగా సువిశాలమైన స్థలం కేటాయిస్తారు. సెక్యూరిటీ సిస్టం గది నిర్మాణం చేస్తారు. బాసర ఆలయ అభివృద్ధి, విస్తరణకు త్వరలో బృహత్తర ప్రణాళిక రూపొందించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బాసర ఆలయ అభివృద్ధి నమూనా విషయంలో సీఎం కేసీఆర్ ఆగమ శాస్త్ర పండితుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. తుది డిజైన్ ఖరారు చేశాక.. టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి అల్లోల వెల్లడించారు.