బాస్‌ ఎవరో తేల్చనున్న ఏసీబీ

2

– ఓటుకు నోటు కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి):

‘ఓటుకు నోటు కేసు’లో అవినీతి నిరోధక శాఖ స్పీడ్‌ పెంచబోతోంది. స్టీఫెన్సన్‌ వాంగ్మూలం.. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా బాస్‌ పాత్రను తెరపైకి తెచ్చేందుకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టేపులపై ఇప్పటికే క్లారిటీ వచ్చిన ఏసీబీ.. అదనపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాస్‌కు నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం మెడకు ఉచ్చు బిగుస్తోంది. రేవంత్‌రెడ్డి స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో చంద్రబాబుపై తెలంగాణ ఏసీబీ ముప్పేట దాడికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత ప్రమేయాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆడియో, వీడియో టేపులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన ంఅః అధికారులు… ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఇచ్చే నివేదికను కోర్టుకు అందజేయనున్నారు.

స్టీఫెన్‌ స్టన్‌ వాంగ్మూలం..

మరోవైపు సోమ, మంగళవారాల్లో స్టీఫెన్‌ సన్‌ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ ఎదుట నమోదు చేయించాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం. కస్టడీలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయసింహ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కోర్టులో ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయనున్నారు. రేవంత్‌ రెడ్డి అరెస్టు సమయంలో ఏసీబీ స్వాధీనం చేసుకున్న 50 లక్షలతో పాటు స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నాలుగున్నర కోట్ల రూపాయలను టీడీపీ ముఖ్య నేతల కార్పొరేట్‌ సంస్థల నుంచి అందినట్లు ఏసీబీ గుర్తించింది. ఆ కోణంలోనూ దర్యాప్తు పూర్తిచేయనుంది.

కేసు విచారణ మరింత కీలకం..

స్టీఫెన్‌ వాంగ్మూలం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక, అదనపు ఎఫ్‌ఐఆర్‌లో పేర్ల అంశాలను పరిశీలించిన తర్వాత ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్న ఏసీబీ అధికారులు చంద్రబాబు బృందానికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో స్టింగ్‌ ఆపరేషన్‌ కేసు వచ్చే వారంలో మరింత కీలకం కానుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నారు.