బిజెపికి ప్రతిష్టగా మారిన యూపి ఎన్నికలు

యూపి ప్రచారంపై ప్రధాని మోడీ ఫోకస్‌
ఎన్నికల్లో గెలిస్తేనే కమలానికి వికాసం
లక్నో,డిసెంబర్‌25(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ మరోమారు విజయం సాధించడం మోడీకి అవసరం. ప్రధానిగా మరోమారు విజయం సాధించాలంటే అక్కడ విజయం అత్యావశ్యక్యం. అందుకే అలుపెరగకుండా అక్కడే మకాం వేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాశీ మొదలు అనేక ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. అనేక అభివృద్ది పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. కాకపోతే
యూపిలో అధికారం కోల్పోతే జాతీయ స్థాయిలో మోడీ అధికారం కోల్పోయే ప్రమాదం ఏర్పడిరదన్న ప్రచారం సాగుతుంది. సాధారణంగా ఎప్పుడూ యూపి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాగుతారు. అక్కడ గెలిస్తే దేశంలో గెలిచినట్లుగా భావిస్తారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా యూపీలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ కేంద్రయంత్రాంగం మొత్తం ఇప్పుడు యూపీకి మారింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా తదితర రాష్టాల్రనుంచి బీజేపీ నేతల్ని రప్పించి ప్రతి జిల్లాలో ప్రచారరంగంలోకి దించారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే లక్నోలో ప్రధాని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పదిలక్షల మందికి పైగా జనాన్ని సవిూకరించేందుకు సన్నాహాలు జరుగుతు న్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌ సమావేశాల కన్నా యూపి ఎన్నికల ప్రచారానికే ప్రధాని మోడీ ప్ధాన్యం ఇచ్చారు. అందుకే రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏదో ఒక కార్యక్రమంతో ప్రచారంలో సాగుతున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. ప్రయాగ్‌ రాజ్‌లోఇటీవలే 16 లక్షల మంది మహిళల స్వయంసహాయ బృందాల ఖాతాలకు రూ. వేయి కోట్లు, లక్షమంది బాలికల ఖాతాలకు రూ. 20 కోట్లు బదిలీ చేశారు. మరోవైపు మాయావతి, ప్రియాంక వాధ్రా, అఖఙలేష్‌ యాదవ్‌లు కూడా ఇదే పద్దతిలో ప్రచారంలో దూసుకుని పోతున్నారు. సర్వశక్తులొడ్డి యూపి ఎన్నికలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపిలో ఓవైపు ప్రియాంక, మరోవైపు సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ యాత్రలకు జనం పెద్ద ఎత్తున హాజరు కావడం బీజేపీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. ఇదే క్రమంలో యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా నరేంద్రమోదీ అఖిలేశ్‌ యాదవ్‌పై ’లాల్‌ టోపీ వాలా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ’ఈ లాల్‌ టోపీ వాలాలు కుంభకోణాలు చేసేందుకు, అక్రమ స్వాధీనాల కోసం, మాఫియాల కోసం, ఉగ్రవాదులను కాపాడడం కోసం అధికారం చేజిక్కించుకోవాలనుకుంటారు. ఈ ఎర్ర టోపీలు యూపీకి రెడ్‌ అలర్ట్‌ లాంటివి’ అని ఆయన హెచ్చరించారు. దీనికి అఖిలేశ్‌ సమాధానమిస్తూ ’పెరుగుతున్న ధరలకు, నిరుద్యోగానికి, రైతులు, కూలీల దుస్థితికి, లఖీంపూర్‌ ఖేరీల హింసాకాండకు వ్యతిరేకంగా మా ఎర్రటోపీలు రెడ్‌ అలర్ట్‌ లాంటివి’ అని అన్నారు. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ కూడా అధికంగా బ్రాహ్మణులు, ఠాకూర్లు ఉన్న ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రధాన పోటీ బీజేపీకి, సమాజ్‌వాది పార్టీకి మధ్య మాత్రమే జరుగు తున్నట్లు కనిపిస్తోంది.ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు ఎటు దారితీస్తుందో చెప్పడానికి మరింత సమయం పడుతుంది. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ ఇంటగెలిచి రచ్చ గెలిచేందుకు ప్రయత్నించాలన్న వైఖరిని అవలంబిస్తున్నట్లు కనపడుతోంది. యూపీలో కనుక భారతీయ జనతాపార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీకి ఇక దేశంలో తిరుగు ఉండకపోవచ్చు. యూపీలో విజయం సాధించడం ద్వారా జాతీయవాదం పేరుతో బీజేపీ దేశమంతటా విస్తరించేందుకు తీవ్ర యత్నాలు మళ్లీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి తీవ్రతరమవుతుందని, జాతీయవాదం బలోపేతమవుతుందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ అన్నిరాష్టాల్ల్రో పాగా వేయాలన్న బలమైన సంకల్పంతో ఉంది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పలు రాష్టాల్ల్రో తమ పార్టీకి చెందిన నేతలు అధికారంలో ఉండేలా చేసుకున్నారు. మొత్తం పార్టీని తమ నియంత్రణలో ఉంచుకుని, తమకు విధేయులైన నేతలకే పట్టం కట్టారు. రాష్టాల్ర అధికారాలను హస్తగతం చేసుకునేందుకు కేంద్రస్థాయిలో చట్టాలను మారుస్తున్నారు. కేంద్రీకృత అధికారం మూలంగా ప్రాంతీయ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని
ప్రాంతీయ పార్టీల నేతలు గగ్గోలు పెడుతున్నా, పట్టించుకోవడం లేదు.ఈ క్రమంలో యూపిలో గెలుపుకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.