బిజెపిపై ఉన్న ఆశలు ఆవిరి
ఒకప్పటి బిజెపి వైభవమే వేరు. ఆ పార్టీలో మేధావులు, విద్యావంతులు, ఆలోచనాపరులు, దేశహితం కోరేవారు, పదవులంటే తృణప్రాయంగా భావించేవారు మాత్రమే ఉండేవారు. దేశ ప్రజలు కూడా బిజెపి పట్ల మక్కువ పెంచుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో బిజెపికి పట్టం కట్టారు. 282 సీట్లు కట్టబెట్టారు. కానీ అలాంటి వైభవం ఇప్పుడు ఆ పార్టీలో లేదు. ఉమ్మడి నిర్ణయాలు లేవు. ఉమ్మడి ఆలోచనలు లేవు. పెద్దలకు గౌరవం ఇవ్వాలన్న ఇంగితం అంతకన్నా లేదు. అసలు పెద్దలనే లేకుండా చేసిన పార్టీగా ఇప్పుడు బిజెపి మిగిలింది. ఇంట్లో ఉన్న అమ్మానాన్నలను అనాధశ్రమంలో వదిలినట్లుగా బిజెపి పెద్దలను పార్టీ కార్యాలయ గడపదొక్కకండా చేశారు. మొత్తంగా ఇద్దరు వ్యక్తుల రాకతో పార్టీ నియతి తప్పింది. కొత్త కోడలు వస్తే ఇంట్లో చిచ్చు రేగినట్లుగా కొత్తగా వచ్చిన మోడీ, అమిత్‌షాల కారణంగా పార్టీ కట్టుకున్న గూడు చెదిరింది. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో ఎన్‌డిఎ పాలనలో ప్రజల్లో ఎప్పుడూ ఇప్పుడున్నంతగా వ్యతిరేకత రాలేదు. ఆయన పాలనలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు జరగలేదు. ఆయన పాలనలో ఉమ్మడి నిర్ణయాలు తీసుకున్నారు. నేతలంతా దేశహితం కోసం పనిచేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదా, ఇతర నేతలను చులకన చేయడం వంటి అవకాశాలకు తావులేకుండా చూశారు. కేవలం రాజకీయాల కోసం పాలన చేయలేదు. పార్టీని విస్తరించుకోవడం కోసం నీతిబాహ్య చర్యలకు ఒడిగట్టలేదు. పార్లమెంటులో ఎలాంటి సమస్య అయినా చర్చకు సిద్దపడ్డారు. పార్లమెంటులో అర్థవంతమైన చర్చకు తావిచ్చారు. సమస్యలపై చర్చ జరగాలని చూశారు. ప్రజలకు మేలు జరగడం, దేశానికి హితం జరగడం అన్న విశాల దృక్పథంతో సాగారు. అందుకే వాజ్‌పేయ్ పాలన గురించి గానీ, ఆయన పాలనా కాలం గురించి గానీ ఎక్కడా మచ్చ రాలేదు. గౌరవ మర్యాదలు ఎలా ఇచ్చి పుచ్చుకోవాలో తెలియచేసిన అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి వారెందరో ఆయనతో పాటు నడిచారు. నిజానికి పార్లమెంటులో చర్చ ద్వారానే ప్రజలకు విషయమేమిటో తెలుస్తుంది. ప్రజలు తమవైపు ఉండేలా కార్యక్రమాలు రూపొందించు కోవాలి. ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉంటే ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా పగ్గాలు మనచేతల్లోనే ఉంటాయి. అందుకోసం పార్లమెంటులో చర్చ జరగాలని అధికార పక్షం కోరుకోవాలి. అల్లరి జరగవద్దని..విూ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం ఇస్తామని చెప్పగలగాలి. పార్లమెంటులో చర్చ జరగకుండా ఇతరలను ప్రోత్సహించి అల్లరి చేయించడం లేదా, సభాకార్యక్రమాలను అడ్డుకునేలా చేయడం వల్ల పార్లమెంటు సమయం వృధా చేయడం బిజెపి పాలనలో అంటే మోడీ,అమిత్‌షాల నాయకత్వంలోని పాలనలో చూశాం. వాజ్‌పేయ్, ఆడ్వాణీ,మురళీమనోహర్ జోషి లాంటి పెద్దలతో బిజెపి ఇతర పార్టీల కంటే విభిన్నమైన పార్టీ అన్న పేరు ఉండేది. మోదీ, అమిత్ షాలు ఈ అయిదేళ్లలో ఈ విభిన్నతను చెరిపివేశారు. ఒక సైద్దాంతిక ప్రాతిపదిక ఉన్న పార్టీని సిద్దాంతాలు లేని పార్టీగా చేసిచూపారు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే పార్టీగా తయారు చేశారు. నిజానికి అయిదేళ్ల క్రితం వరకు మోదీ, అమిత్ షాలు గుజరాత్ దాటి వచ్చిన వారు కాదు. కాని ఈ అయిదేళ్లలోనే వారు 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని అలవర్చుకున్నారు. ఇతర పార్టీలకున్న సర్వ అవలక్షణాలను బిజెపిలో చొప్పించారు. అంతేగాని బిజెపికి ఉన్న లక్షణాలతో దేశ ప్రతిభను ఇనుమడింప చేయలేయలేక పోయారు. ఈ ఒక్కమాట చాలు…బిజెపి ఇప్పుడు ఏ స్థితిలో ఉందో చెప్పడానికి..దేశంలో రాజకీయ పార్టీల్లో నైతికత అనేది రోజురోజుకూ కనుమరుగవుతున్నది. ఎన్నికల ఘట్టం సవిూపిస్తున్న కొద్దీ ఎవరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది. పార్టీల్లో సైద్దాంతిక విలువలు దిగజారి పోతుతన్నాయనడానికి ఇది నిదర్శనం. అయితే
బిజెపి అలా ఉండేది కాదు. కానీ అది కూడా మామూలు పార్టీల జాబితాలో చేరింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే పార్టీ కార్యాలయానికి వెళ్లి కండువాలు కప్పుకునే సంస్కృతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రవేశించింది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తరవాత కాంగ్రెస్‌తో సహా వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు అమిత్ షా, మోదీలను కలుసుకుని బిజెపిలో చేరిపోయారు. గత అయిదేళ్లలో మోదీ తన ప్రత్యేకత ఏవిూ నిరూపించుకోలేకపోయారు. ఇచ్చిన హావిూల్లో అనేకం అమలు చేయలేదని ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు 2014 నాటి వాతావరణం ఏవిూ కనపడడం లేదు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనం వీస్తోందని, 300సీట్లకు పైగా గెలుస్తామని బిజెపి నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మిన వాళ్లకు సైతం వాస్తవాలు భిన్నంగా కనపడుతున్నాయి. 2014లో యుపిఏ పదేళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను ఆసరాగా తీసుకుని జాతీయ రాజకీయాల్లో ప్రవేశించగలిగిన నరేంద్రమోదీకి ప్రజల వద్దకు వెల్లగలిగే అస్త్రం ఏదీ లేదు. దేన్ని ఆసరాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో నాలుగు దశల ఎన్నికలు ముగిసాయి. మరో మూడు దశలతో ఈ నెల 19తో ఎన్నికల ఘట్టం ముగుస్తుంది. తన పథకాల గురించి ధైర్యంగా చెప్పుకుని వాటి ద్వారా విజయం సాధించడం అంత సులభం కాదని ఇప్పటికే మోదీకి అర్థమయినట్లుంది. అందుకే ఆయన ఇతర పార్టీలను బలహీనపరచడం ద్వారా, ప్రత్యర్థులపై దాడులు చేయడం ద్వారా, సంస్థలను బలహీనపరచడం ద్వారా లబ్ది పొందాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం కానరావడం లేదు. మోడీ ఆశాజ్యోతి అవుతారని నమ్మిన వారంతా మోసపోయారు. అందువల్ల ప్రజలు ఈ ఎన్నికల్లో ఏ విధంగా స్పందిస్తారన్న ఉత్కంఠ పెరుగుతోంది.