బిజెపిలో చేరిన మైనార్టీ నేత

చేరికలు పెరిగాయన్న కన్నా
రాయపాటి చేరికపై సమచారం లేదని వెల్లడి
విజయవాడ,జూలై22 (జ‌నంసాక్షి):  సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మైనారిటీ నేత ఖాజా అలీ సోమవారం ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీజేపీలోకి చేరికలు నిత్యం కొనసాగుతున్నాయని చెప్పారు. జనసేన, టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి చేరికలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న చిత్తశుద్ధి చూసి బీజేపీ వైపు అందరూ వస్తున్నారని వ్యాఖ్యానించారు. మైనారిటీ, బీసీ, దళిత వర్గాల నుంచి చేరికలు ఎక్కువగా వున్నాయని తెలిపారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు జనసేన నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ బీజేపీలో చేరారు. కాగా,  చంద్రబాబు నాయుడిపై విసుగుతోనే టీడీపీ నేతలు పార్టీ వీడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఫిరాయింపులపై చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదని, ప్రధాని మోదీ పనితీరును చూసి టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని వివరించారు.  బీజేపీలో చేరుతున్నట్లు టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటనపై కూడా కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. రాయపాటి, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నట్లు తనకైతే ఎటువంటి సమాచారం లేదని తేల్చిచెప్పారు. బీజేపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. ఆషాఢమాసం వల్ల చేరికలు ఆగాయన్నారు. శ్రావణ మాసంలో మాత్రం భారీ సంఖ్యలు చేరికలు ఉంటాయని వెల్లడించారు. 2019 ఎన్నికల తర్వాత ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీలోకి చేరికలు పెరిగాయని చెప్పుకొచ్చారు. మైనారిటీలు, దళితుల నుంచి కూడా చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాల నుంచి కూడా నేతలు బీజేపీలోకి వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. దీనిపై పోలీసులు స్పందించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మా వంతు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఇసుక కొరతతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. వివిధ సమస్యలపై తాను జగన్‌కు లేఖలు రాసినా.. స్పందన లేదని విమర్శించారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తాను లేఖ రాస్తే స్పందించడం జగన్‌ నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు. ఇదిలావుంటే రెండ్రోజుల క్రితం రాయపాటి సాంబశివరావుతో బీజేపీ నేత రాంమాధవ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయపాటిని బీజేపీలోకి ఆహ్వానించారు. అలాగే  తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం రాయపాటి కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కానీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం తనకేవిూ తెలియదనడం గమనార్హం.