బియ్యం కన్నా తృణధాన్యాల సరఫరా మేలు

మెదక్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తృణధాన్యాలను సేంద్రియ పద్దతిలో ఉత్పత్తి చేయడంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో డక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చేస్తున్న కృషి కారణంగా రైతులు లాభాల బాటపడుతున్నారు. అయితే వీరు పండించే పంటలు ప్రజలకు ఎంతో ఆవసరం. ఆరోగ్యానికి తృణధాన్యాలు మంచివి. ఇలాంటి పంటలను ప్రోత్సహించి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇకపోతే గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల ద్వారా జొన్నలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు చిరు, తృణ ధాన్యాల ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలను అంచనా వేసేందుకు పైలట్‌ ప్రాజెక్టును చేపట్టింది. వికారాబాద్‌ జిల్లాలోని రేషన్‌ షాపుల ద్వారా సబ్సిడీపై జొన్నలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జూన్‌ 2 నుంచి అమలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ దివ్య తనుకున్న ప్రత్యేక నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, ఎంపిక చేసిన గ్రామాల్లో కుటుంబానికి 8 కిలోల చొప్పున జొన్నలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. గతంలో జొన్నలు, మక్కలు, గోధుమలు చౌక దుకాణాల్లో దొరికేవి కానీ సబ్సిడీ బియ్యం పథకం వచ్చాక వీటిని పక్కన పెట్టారు. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో తృణ ధాన్య ఆహారం అందించేందుకు ప్రతిపాదనలు రూపొందించిన కలెక్టర్‌ వీటిని మహిళాశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ విజయేంద్ర బోయికి పంపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు.

అలాగే, వికారాబాద్‌ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నందున రేషన్‌ షాపుల ద్వారా జొన్నలు పంపిణీ చేసే విషయాన్ని పరిశీలించాలని పౌరసరఫరాల కమిషనర్‌ ఆనంద్‌కూ కలెక్టర్‌ లేఖ రాసినట్టు తెలుస్తోంది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా అంగన్‌ వాడీ కేంద్రాల్లోనూ చిరు, తృణ ధాన్యాలను పంపిణీ చేశారు. మొత్తం 45 అంగన్‌ వాడీ కేంద్రాల్లో వెయ్యి మంది పిల్లలకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నెలలో 17 రోజుల పాటు జొన్న ఉప్మా, తృణ ధాన్యాల కిచిడీని అందిస్తున్నారు. దీనికి కూడా కలెక్టర్‌ తనకున్న ప్రత్యేక నిధులు ద్వారా బడ్జెట్‌ కేటాయించారు. ఈ ప్రయోగం మంచి ఫలితం ఇస్తే వికారాబాద్‌ జిల్లాలోని 1104 అంగన్‌ వాడీ కేంద్రాలలోని 18,768 మంది పిల్లలకు చిరు, తృణ ధాన్యాల ఆహారాన్ని అందించనున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉండటంతో వాటిని తీసుకున్న పిల్లల్లో వచ్చిన మార్పుల ఆధారంగా తొలుత వికారాబాద్‌ జిల్లా… తర్వాత రాష్ట్రమంతటా అమలు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ యోచిస్తోంది.

అయితే చిరు, తృణ ధాన్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీని భరించే పరిస్థితి లేదు. పైగా వీటిని అన్ని జిల్లాల్లో తీసుకునే అవకాశం కూడా లేదు. కాకపోతే వికారాబాద్‌ జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు సక్సెస్‌ అయితే… గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దీన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఒకవైపు రేషన్‌ షాపులను రద్దు చేసే యోచనలో ఉన్న ప్రభుత్వం మరోవైపు ఇలాంటి పైలట్‌ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల ప్రజలకు మేలు చేసినట్లు అవుతుంది. వికారాబాద్‌ ప్రాంతంలో సంప్రదాయంగా తృణ ధాన్యాలను పండించడమే కాకుండా ఎక్కువగా వినియోగిస్తారు. అలాగే, గిరిజన తండాలుండడంతో ప్రయోగాత్మకంగా ఈ జిల్లాను ఎంపిక చేశారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాల్లో జొన్నలు పంపిణీ చేయనున్నారు. రేషన్‌ షాపుల్లో సరఫరా చేసే కిలో రూపాయి బియ్యాన్ని తక్కువ ధరకు కొని.. వాటికి పాలిష్‌ పట్టించి మార్కెట్లో సన్నబియ్యంగా విక్రయిస్తున్నారు. సరిహద్దు గ్రామాల గుండా కర్నాటక, మహారాష్టాల్ల్రో ఈ వ్యవహారం సాగుతోంది. స్థానికంగా ఉన్న కొందరి నేతల కనుసన్నల్లోనే ఇదంతా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. లారీలు, ఇతర రవాణాల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా మన బియ్యాన్ని కర్నాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించడంతో పట్టపగలే బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మకై బియ్యాన్ని అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్సు అధికారులు ఎన్నిసార్లు పట్టుకున్నా దందా మాత్రం ఆగడం లేదు. ఓ వైపు విజిలెన్స్‌ అధికారులు బియ్యం పట్టుకొని కేసులు నమోదు చేసుండగానే మరో చోట బియ్యం ఇతర ప్రాంతాలకు తరలుతోంది. పౌరసరఫరాల గోదాం అధికారులు పరోక్షంగా సాయం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో బియ్యాన్ని గోదాం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గోదాంలో నిల్వ ఉంచిన బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే బియ్యంలో కలిపే ప్రయత్నాలు నిత్యం జరుగుతున్నాయన్నఆరోపనలు ఉన్నాయి. దీనికి స్థానికంగా ఉన్న కొందరు డీలర్ల సహకారం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. డీలర్లకు కేటాయించే బియ్యాన్ని కొందరు పూర్తి స్థాయిలో తీసుకెళ్లకుండా నిల్వ ఉంచడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుట్టుగా ఇతర ప్రాంతాలకు బియ్యం తరులు తున్నాయని తెలుస్తోందికిలో ఒక్క రూపాయికి లభించే బియ్యాన్ని చిన్న పాటి వ్యాపారులు రూ.10లకు పైగా వెచ్చించి ఆటల్లో ఇక్కడి తరలిస్తున్నారు. తనిఖీ కేంద్రాలు, చెక్‌పోస్టులు బియ్యం వ్యాపారులకు వరంగా మారాయి. ఈ దశలో రేషన్‌ షాపులు రద్దు చేస్తే తృణధాన్యాలు అందుబాటులోకి తీసుకుని రావాలని రైతులు కోరుతున్నారు.

 

తాజావార్తలు