బియ్యం కార్డుల కోసం ఎదురుచూపు

విజయవాడ,జూలై11(జనం సాక్షి)):కొత్త బియ్యం కార్డుల కోసం లబ్దిదారులు మరి కొంతకాలం నిరీక్షించక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల వద్దనే స్పష్టమైన
సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. దీంతో బియ్యం కార్డులు ఎప్పుడిస్తారోనంటూ లబ్దిదారులు నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు పాత రేషన్‌కార్డు లబ్దిదారులతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా బియ్యం కార్డులు జారీ చేయాల్సి ఉంది. గతంలో అన్ని రకాల సంక్షేమ పథకాలకూ రేషన్‌కార్డు వర్తింపజేసేవారు. ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. కొత్తగా జారీ చేసే బియ్యం కార్డులను ఇతర సంక్షేమ పథకాలకు వర్తింపజేయరు. కేవలం ఎఫ్‌పీ షాపుల్లో నిత్యావసర సరుకులు తీసుకునేందుకే అవి ఉపయోగపడతాయి. తమకు అన్ని అర్హతలూ ఉన్నా కార్డులు రాకపోవడంపై బాధిత వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆదాయ పన్ను చెల్లింపుదారులు బియ్యం కార్డుకు అర్హులు కాదు. సొంత నాలుగు చక్రాల వాహనం కలిగినవారు కూడా అనర్హులవుతారు.