బిసిలకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలి

తెలంగాణ భవన్‌ ముందు కాంగ్రెస్‌ నిరసనలు

న్యూఢిల్లీ,నవంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ భవన్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం తెలంగాణ కాంగ్రెస్‌ బిసి నేతలు ఆందోళనకు దిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలకు తమ జనాభాకు అనుగుణంగా సీట్లు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. ముందునుంచి తాము కోరుతున్నా అందుకు తగ్గట్లుగా టికెట్ల కేటాయింపులో బిసిలకు అన్యాయం చేస్తున్నారని వారు నిరసన వ్యక్తం చేశారు. బిసిలకు 40 సీట్లతో పాటు సిఎం పదవి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. జనాభాలో నాలుగు శాతం ఉన్న సామాజిక వర్గానికి 40కి పైగా సీట్లు ఇచ్చారని, 60 శాతం ఉన్న బిసిలకు తగినన్ని సీట్లు ఇవ్వలేదని వారు తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌యాదవ్‌, ఒబిసి సెల్‌ కన్వీనర్‌ అశోక్‌గౌడ్‌, పిసిసి మాజీ కార్యదర్శి రాపోలు జయప్రకాశ్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కేవలం తాము తమ వర్గానికి న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నామని అన్నారు. దీనిని కాంగ్రెస్‌ అధిష్టానం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.