బిసిసిఐ అధ్యక్ష పదవిపై ఆ మూడు రాజకీయ పార్టీల కన్ను

m0qegm46న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దాల్మియా మరణంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్ష పీఠంపై మూడు రాజకీయ పార్టీలు కన్నేశాయి. పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అధ్యక్ష రేసులో బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా ఉన్నారు. వీరిలో బిసిసిఐ కార్యదర్శిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ ఈ సారి ఎలాగైనా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలలో ఉన్నారు. దాల్మియా అనారోగ్యం నేపథ్యంలో బిసిసిఐకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఠాకూరే చూసుకుంటున్నారు. ఈయన 15 రోజుల్లోగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులోనే కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమౌతుంది. ప్రస్తుతం ఐపీఎల్ కమిషనర్‌గా ఉన్న రాజీవ్ శుక్లాకు బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అండదండలున్నట్లు సమాచారం. ఇక ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన శరద్ పవార్‌ కూడా మరోసారి బిసిసిఐ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారు. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ముగ్గురూ రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో విజయం ఎవరిని వరించనుందనేది 15 రోజుల తర్వాతే తేలనుంది. కోట్ల రూపాయల ఆదాయంతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బిసిసిఐపై రాజకీయ పార్టీలు కన్నేయడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. అయితే గెలిచాక ఏం చేస్తారనేది మాత్రం సస్పెన్సే మరి.