బిసి బాలికల కోసం వసతి గృహం
ఖమ్మం, జూలై 17: జిల్లాకలెక్టర్ సిద్ధార్థజైన్ చొరవతో బిసి బాలికల కోసం జిల్లా కేంద్రంలోని గుట్టలబజారులో ఉన్న పాతసట్కాం కార్యాలయానికి మరమ్మతులు చేసి వసతి గృహంగా మార్చినట్టు జిల్లా బిసి సంక్షేమ అధికారి వెంకట నర్సయ్య మంగళవారం ఇక్కడ తెలిపారు. బిసి బాలిక వసతి గృహంలో జరుగుతున్న మరమ్మతు పనులను నాణ్యత చేయిస్తామన్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే బలికలు గుట్టల బజారులోని వసతి గృహంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం పొందవచ్చని ఆయన అన్నారు. జిల్లాలోని మండలాల నుంచి ఖమ్మం పట్టణానికి వచ్చి చదువుకునే విద్యార్థులు వసతి గృహాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఉన్న బిసి వసతి గృహాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఎలక్ట్రిసిటీ, ఇతర పనుల కోసం ఒక్కొక్క వసతి గృహానికి 1.72లక్షలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. అంతేకాక కలెక్టర్ మరో 60 లక్షలు అందించారన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ నెలాఖరులోగా అన్ని వసతి గృహాల్లో మరమ్మతు పనులు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.