బిసి రుణాల్లో న్యయాం చేయాలి

కరీంనగర్‌,మే7(జ‌నంసాక్షి): జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల యూనిట్ల ఎంపికలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రాజకీయ జోక్యం నిరోధించాలని కోరుతున్నారు. వీరి ఆమోదం లేనిదే యూనిట్లు మంజూరయ్యే పరిస్తితి లేదని అంటున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు ప్రభుత్వం అందచేస్తున్న రుణాలు జిల్లాలో పైరవీలకు  ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.లక్ష సబ్సిడీతో రూ.2లక్షల రుణం తీసుకోవాలన్నా బ్రోకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు బ్యాంకర్లు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.  ప్రజాప్రతినిధులు, అధికారుల కనుసన్నల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. చాలా రోజుల తరువాత బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు కావడంతో సహజంగానే పోటీ అధికమైంది. ప్రధానంగా రూ.2లక్షల రుణంలో రూ.లక్ష సబ్సిడీ ఉండడంతో ఈ యూనిట్లకు  డిమాండ్‌ ఏర్పడింది.  మున్సిపల్‌, మండలాల్లో ఎక్కడైనా స్థానిక ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరులకే ఈ యూనిట్లు కేటాయించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్ని చోట్ల సంబంధిత అధికారులు, సిబ్బంది బంధుగణానికి ఈ యూనిట్లు అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నారు.  గ్రామాల్లో లబ్దిదారుల ఎంపిక ముందే పూర్తయ్యిందని తెలుస్తోంది. పూర్తి అర్హత ప్రమాణాలతో తగిన సర్టిఫికెట్లు, బ్యాంక్‌ కాన్సెంట్‌తో సదరు నిరుద్యోగి మున్సిపాలిటీ, మండల కార్యాలయూల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను సిబ్బంది ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌  చేస్తారు. ఆ తరువాత బ్యాంకర్లు, అధికారులు కలిసి ఒకేరోజు దరఖాస్తుదారులతో సమావేశం ఏర్పాటు చేసి లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. అలా ఎంపిక చేసిన జాబితాను బీసీ కార్పొరేషన్‌ కార్యాలయానికి పంపించాలి. కలెక్టర్‌ ఆమోదం పొందిన తరువాత లబ్దిదారులకు రుణం మంజూరవుతుంది. బ్యాంక్‌ అకౌంట్‌లో సబ్సిడీ జమవుతుంది. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్‌ చేస్తున్నారు.