బిహార్‌ పోలింగ్‌ ప్రశాంతం

పట్నా,నవంబరు3 (జనంసాక్షి): బిహార్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసంది మొత్తం 243 సీట్లకు గానూ.. రెండో విడతలో 94 స్థానాలకు మంగళవారం ఓటింగ్‌ జరిగింది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎం సమస్యలు, కొవిడ్‌ నిబంధనల కారణంగా ఓటింగ్‌ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు బిహార్‌లో 19.26శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా.. తొలి గంటల్లో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.దిఘాలోని ప్రభుత్వ పాఠశాలలో సీఎం నితీశ్‌ కుమార్‌ ఓటేశారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.హజీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, భాజపా నేత నిత్యానంద రాయ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పట్నాలో ఓటేశారు. పట్నాలోని 160వ పోలింగ్‌ కేంద్రం వద్ద తల్లి, మాజీ సీఎం రబ్రీదేవితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు తమ ఓటు అధికారంతో బిహార్‌లో కచ్చితంగా మార్పు తీసుకొస్తారని తేజస్వీ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ కూడా ఓటేశారు. బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశిల్‌ కుమార్‌ మోదీ పట్నాలోని రాజేంద్ర నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్‌ ఖగరియాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.