బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోవైపు అందరిచూపు

అభ్యర్థుల మొదలు అట్టడుగువర్గాలదాకా ఆసక్తి
మహిళలకు, రైతులకు, యువతకు పెద్దపీట వేసే అవకాశం
నేడు ఎన్నికల సమరశంఖం పూరించనున్న సీఎం కేసీఆర్‌
గులాబీ దళపతి ఎంట్రీతో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం
హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి (జనంసాక్షి):మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదలకు సిద్ధమైంది. అభ్యర్థులకు బీఫామ్స్‌ అందించడంతో పాటు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నేడు మేనిఫెస్టో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భారీ ఉరుములు, మెరుపులు ఉంటాయని పార్టీ శ్రేణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా రైతులకు, మహిళలకు పెన్షన్లు, యువతకు ప్రత్యేక ఆకర్షణీయ పథకాలు అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించాలని యోచిస్తున్న సీఎం కేసీఆర్‌.. మెజార్టీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేవిధంగా మేనిఫెస్టోను రూపొందించారని తెలిసింది. అన్నివర్గాల ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై కన్నేశాయి. గత రెండు పర్యాయాలు ఎవరి అంచనాలకందకుండా సీట్లు పొందిన గులాబీ పార్టీ.. ఈసారి ఏవిధంగా ముందుకెళ్తుందోననే ఆసక్తి కనబరుస్తున్నాయి. మరోవైపు నెలన్నర రోజుల కిందటే అభ్యర్థులు ఖరారైపోగా.. వారు కూడా నేటి మేనిఫెస్టోపైనే భారీ ఆశలు పెట్టుకున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు.
రంగంలోకి స్వయంగా కేసీఆర్‌..
ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న రాజకీయ వాతవరణమూ నేటితో వేడెక్కనుంది. సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌ ప్రాంతమైన హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల సమరశంఖం పూరించనున్న ఆయన.. వరుస పర్యటనలతో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచనున్నారు. ఆగస్ట్‌లోనే అభ్యర్థులు జాబితాను ప్రకటించినప్పటికీ.. ఊహించనంత ఉత్సాహం పార్టీ శ్రేణుల్లో కనబడలేదు. ఒకవైపు హరీశ్‌రావు, మరోవైపు కేటీఆర్‌ వరుసగా శిలాఫలాకాలను ప్రారంభిస్తూ జిల్లాల పర్యటన చేసినా చెప్పుకోదగ్గ స్థాయిలో రాజకీయ వాతావరణం సంతరించుకోలేదు. అదే సందర్భంలో తుక్కుగూడ విజయభేరి సభతో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, సోనియాగాంధీ సమక్షంలో ఆరుగ్యారంటీలను ప్రవేశపెట్టిన హస్తం పార్టీ.. క్షేత్రస్థాయిలోకి దూసుకుపోయేలా కార్యచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ అనారోగ్యం, తదితర కారణాలతో బీఆర్‌ఎస్‌ ఎన్నికల సభలు ముందుకు సాగలేదు. నేడు స్వయంగా అధినేత సమక్షంలో పార్టీ కార్యచరణ ప్రారంభం కావడం, సుదీర్ఘకాలం తర్వాత రాజకీయ సభలకు సీఎం కేసీఆర్‌ హాజరవుతుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీలపై ఆయన ఏవిధంగా విరుచుకుపడతారు? ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారు? ప్రజలను ఏవిధంగా ఆకర్షిస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులు సైతం ఆయన రాకతో పెరిగే జోష్‌పైనే భారీ ఆశలు పెట్టుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.