బీజేపీలోకి జితేందర్‌ రెడ్డి!


– బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్‌ మాధవ్‌తో భేటీ
– మూడు హావిూలిస్తే చేరతానని వెల్లండి
– సానుకూలంగా స్పందించిన రామ్‌ మాధవ్‌
– 29న మహబూబ్‌నగర్‌లో జరిగే మోదీ సభలో బీజేపీలో చేరే అవకాశం
హైదరాబాద్‌, మార్చి26(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ కీలక నేత మహబూబ్‌ నగర్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి కారు దిగి.. కమలం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఎంపీ టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించిన టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పి.. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌తో సోమవారం రాత్రి భేటీ అయిన ఆయన.. మూడు ప్రధాన డిమాండ్లతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్‌ బాధ్యతలతో పాటు ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభ పదవి, 29న తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీతో పాటు తనను చాపర్‌లో మహబూబ్‌ నగర్‌కు పంపాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లలో తొలి రెండింటికి రాంమాధవ్‌ సూతప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. కాగా 29లోగా అన్నికుదిరితే మహబూబ్‌నగర్‌లో అదేరోజు జరిగే మోదీ బహిరంగ సభలో జితేందర్‌ రెడ్డి బీజేపీ కండువా కప్పుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే జితేందర్‌రెడ్డి గతంలో బీజేపీ తరుపున మహబూబ్‌నగర్‌ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీతో జితేందర్‌ రెడ్డికి మంచి సత్సంబంధాలున్నాయి. మహబూబ్‌నగర్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న జితేందర్‌ రెడ్డి.. తెరాస లోక్‌సభాపక్ష నేతగానూ ఉన్నారు. తెరాస అదినేత కేసీఆర్‌తో జితేందర్‌ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. కానీ ఏప్రిల్‌11న జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో మరోసారి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు
కేసీఆర్‌ నిరాకరించారు. ఆయన స్థానంలో ప్రముఖ వ్యాపారవేత్త మన్నె శ్రీనివాస్‌రెడ్డిని బరిలోకి దింపారు. ఆయన గెలుపు కోసం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని తెరాస శ్రేణులు విస్తృత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఓటమికి జితేందర్‌ కృషి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో స్వయంగా గులాబీ బాస్‌ కేసీఆర్‌ కలుగజేసుకున్నా… జితేందర్‌ వెనక్కి తగ్గలేదని ప్రచారం జరిగింది. జితేందర్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌లతో సమావేశమైన ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని బలంగా చెప్పడంతో జితేందర్‌రెడ్డిని  పక్కన పెట్టారు. అధిష్ఠానం నిర్ణయంతో ఆలోచనల్లో పడ్డ జితేందర్‌.. బీజేపీతో మంతనాలు జరిపారు.  కాగా ఆదివారం వరకు తాను తెరాసలోనే ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదని చెబుతూ వచ్చారు. కాగా కార్యకర్తల ఒత్తిడిమేరకు భాజపాలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు, దీంతో సోమవారం రాత్రి రామ్‌మాదవ్‌తో భేటీ అయినట్లు తెలుస్తుంది.