బీజేపీ హింసను రెచ్చగొడుతోంది : రాహుల్

njw9qhc4డిగ్బోయ్ (అసోం) : బీజేపీ ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో హింసను రెచ్చగొడుతోందని, అసోంలో కూడా హింస తిరిగొస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి ఏమైపోవాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అసోంలోని డిగ్బోయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. మన ముందు ఎన్నికలు వస్తున్నాయని, రెండు రకాల ఆలోచనల మధ్య పోటీ ఉందని చెప్పారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ ఉన్నారన్నారు. ప్రధాని ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి గురించి మాట్లాడతారు గానీ, బీజేపీ ఏ రాష్ట్రంలో గెలిచినా అక్కడ మాత్రం హింస చెలరేగుతుందని రాహుల్ అన్నారు. నల్లధనం మీద పోరాడుతానని మోదీ ఒకవైపు చెబుతూనే ఉన్నా, మరోవైపు మాల్యా లాంటివాళ్లు మాత్రం దేశం వదిలి పారిపోతారని ఎద్దేవా చేశారు. మాల్యా వెళ్లిపోవడానికి రెండు మూడు రోజుల ముందు కూడా పార్లమెంటులో అరుణ్ జైట్లీతో మాట్లాడారని, వాళ్లిద్దరి మధ్య ఏం మాటలు నడిచాయని ప్రశ్నించారు. ప్రధాని నిజంగా అవినీతిపై పోరాడుతుంటే, ఆయన ఎందుకు ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ స్కీము ప్రవేశపెట్టారని రాహుల్ నిలదీశారు.