బీఫ్ తింటే చంపేస్తారా..?
– ఇదేమి రాజ్యం
– ఓవైసీ ఆగ్రహం
హైదరాబాద్ ,అక్టోబర్1(జనంసాక్షి):
బీఫ్ తిన్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తిని చంపడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ ఆవు మాంసం తింటే ఇలా శిక్షిస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఒవైసీ మాట్లాడుతూ.. ఓ వ్యక్తిని చంపారని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యాన్ని దోపిడీ, దౌర్జన్య సామ్యంగా మార్చుతున్నారు అంటూ ధ్వజమెత్తారు.భారత్ ను హిందుత్వ దేశంగా చేయాలని సంఘ్ పరివార్ సభ్యులు ప్రయత్నిస్తే దేశం మరింత బలహీనమవుతుందని ఒవైసీ వ్యాఖ్యానించారు. హత్యకు గురైన వ్యక్తి కొడుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో సేవలందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఓ వ్యక్తి బీఫ్ తింటే మాత్రం చంపాలని ఆదేశాలు జారీ చేస్తారా.. అలా అయితే, చట్టాలు.. కోర్టులు.. పోలీసులు ఎందుకు.. వాటినన్నింటిని మూసివేయొచ్చుగా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి మహేశ్ శర్మ.. ఇది కేవలం తప్పిదమేనని వ్యాఖ్యానించడంపై కూడా ఒవైసీ మండిపడ్డారు. ఓ వ్యక్తిని హత్య చేయడం చిన్న విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం చెల్లించింది, కానీ ఘటనకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకుందని ఒవైసీ ప్రశ్నించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన అక్‌లాక్ (50) హత్య, అతని కొడుకు దానిస్ స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన విషయం విదితమే.