బీమా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు
నిజామాబాద్,జూలై5(జనం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైతు బీమా పథకం అర్హులైన ప్రతి రైతు వర్తించేలా నిరంతర పక్రియ కొనసాగుతుందని జిల్లా వ్యవసాయ శాఖధికారి మేకల గోవింద్ పేర్కొన్నారు. పట్టాదారుపాస్ పుస్తకాలు ఇచ్చిన ప్రతి రైతుకు ఆగస్టు 15 నుంచి రూ. 5లక్షల బీమా వర్తించేలా జిల్లాలో రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని అన్నారు. ప్రభుత్వం 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి రైతుకు రూ. 5లక్షల బీమాను ఆగస్టు 15 నుంచి వర్తించేలా మార్గదర్శకాలను విడుదల చేసిందని ఆయన తెలిపారు. నమోదు చేసిన రైతుల వివరాలను బీమా సంస్థలకు ఎప్పటికప్పుడు చేరవేసి, ప్రభుత్వం చెల్లించే 2,171 రూపాయల 50 పైసలు ప్రతి రైతు పేరుతో ప్రభుత్వ బీమా వర్తించేలా ప్రీమియం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. బీమా ఉన్న ప్రతీ రైతు నామినీ వయస్సు పరిమితి 18 సంవత్సరాలు పైబడిన వారికే ప్రమాదవశాత్తు, సహజ మరణం వారికి రూ. 5లక్షల ఇన్సూరెన్సు వర్తిస్తుందన్నారు.