బీయాస్‌ నదీ ప్రమాద ఘటనపై హిమాచల్‌ హైకోర్టు సంచలన తీర్పు

2

న్యూఢిల్లీ,జనవరి 2(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో గల్లంతై 24 మంది తెలుగు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. 2014 జూన్‌ 8న హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు బియాస్‌ నదిలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థినులతోపాటు 18 మంది విద్యార్థులు మృతిచెందారు. కేసు విచారించిన హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ముందస్తు హెచ్చరికలు లేకుండా డ్యాం నుంచి నీరు విడుదల చేయడం సరైన చర్య కాదని తెలిపింది. ఈ ఘటనలో కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని న్యాయస్థానం పేర్కొంది. బాధిత విద్యార్థుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పరిహారంలో 60 శాతం బియాస్‌ డ్యాంబోర్డు, 30 శాతం కళాశాల, 10 శాతం హిమాచల్‌ సర్కారు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పరిహారంపై 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది.