బీసీసీఐకి ఊరట

– సవరించిన రాజ్యాంగానికి సుప్రీం ఓకే

న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ)కి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. బీసీసీఐ రాజ్యాంగంపై గురువారం సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఒక రాష్ట్రం ఒక ఓటు నిబంధనలో అత్యున్నత న్యాయస్థానం మార్పు చేసింది. కోర్టు బరోడా, సౌరాష్ట్ర, సర్వీసెస్‌, రైల్వేలను కూడా సభ్యులుగా చేర్చింది. ముంబై, విదర్భ, మహారాష్ట్ర కూడా సభ్యులుగా ఉంటాయి. కూలింగ్‌ పీరియడ్‌ ను మూడేళ్ల నుంచి పెంచి రెండు టర్మ్‌ లు అంటే ఆరేళ్లుగా చేసింది. 70 ఏళ్ల వయసు పరిమితి, ప్రభుత్వాధికారి, మంత్రుల అనర్హత కొనసాగుతుంది. నాలుగు వారాల్లో రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు బీసీసీఐని ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన గత విచారణలో సుప్రీంకోర్ట్‌ కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ ఉండరాదని వ్యాఖ్యానించింది. తమ తీర్పు వచ్చే వరకు బీసీసీఐ రాష్ట్ర క్రికెట్‌ సంఘాల ఎన్నికలు నిర్వహించరాదని, బీసీసీఐ ప్రస్తుత రాజ్యాంగంలో మార్పుచేర్పులు చేయరాదని చెప్పింది. తమ తీర్పును వాయిదా వేస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. రాష్ట్ర క్రికెట్‌ సంఘాల అడ్మినిస్టేట్రర్ల నియామకాలకు సంబంధించిన ఏ పిటిషన్‌ ను విచారణకు స్వీకరించరాదని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ల త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఒక రాష్ట్రం-ఒక ఓటు, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లకు సంబంధించి ఇంతకు ముందు ఇచ్చిన తీర్పుని పున:పరిశీలిస్తామని కోర్టు చెప్పింది. జస్టిస్‌ లోధా కమిటీ సూచించిన కూలింగ్‌ ఆఫ్‌ సిఫార్సుని తాము అంగీకరించబోమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బీసీసీఐ సలహాలు స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.