బీసీసీఐపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: జస్టిస్ లోథా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.  క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి బీసీసీఐ చేపట్టిన చర్యలు ఏమీ లేవంటూ ఘాటుగా విమర్శించింది.  మంగళవారం లోథా కమిటీ ప్రతిపాదనలపైవిచారణ చేపట్టిన సుప్రీం బీసీసీఐ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. దయచేసి లోథా కమిటీ ప్రతిపాదనలు అమలు పరచమని చెప్పొద్దంటూ బీసీసీఐకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ పరిపాలన విభాగం యాంత్రికంగా మాత్రమే తమ విధులు నిర్వర్తించడం ఎంతమాత్రం సరికాదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ఐపీఎల్-2013లో ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో లోథా కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. డబ్భై  ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదని సూచిండంతో పాటు, ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు మాత్రమే ఉండాలని లోథా కమిటీ ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మిగిలిన సంఘాలు అనుబంధసభ్యులు మాత్రమే ఉండాలని పేర్కొంది. ఒక సభ్యుడు మూడేళ్లు పదవిలో ఉంటే విరామం తీసుకుని తిరిగి మరో పదవి తీసుకోవాలని, అదే సమయంలో ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పదవిలో ఉండాలని సూచించింది.  ఒకే వ్యక్తి బీసీసీఐలో, రాష్ట్ర సంఘంలోనూ ఒకే సమయంలో సభ్యుడుగా ఉండకూడదని,బోర్డును ఆర్టీఐ  పరిధిలోకి తేవాలని తదితర ప్రతిపాదనలను లోథా కమిటీ ప్రతిపాదించింది. వీటిపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ బీసీసీఐ గత నెల్లో అఫిడవిట్ దాఖలు చేసింది.