బీసీసీఐలో మంత్రులకు నో చాన్స్: సుప్రీంకోర్టు

Supreme_Court_of_India_-_Retouchedన్యూఢిల్లీ: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)లో లోధా క‌మిటీ సిఫార‌సు చేసిన కీల‌క సంస్క‌ర‌ణ‌ల అమ‌లుపై సుప్రీంకోర్టు సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది. క‌మిటీ సిఫార‌సుల‌కు కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. బోర్డులో మంత్రులు స‌భ్యులుగా ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టంచేసింది. అంతేకాదు స‌భ్యుల వ‌య‌సు 70కి మించ‌వ‌ద్ద‌న్న నిబంధ‌న‌కు కూడా ఓకే చెప్పింది. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అన్న నిబంధ‌న‌ను కూడా అమ‌లుచేయాల‌ని ఆదేశించింది. ఈ సంస్క‌ర‌ణ‌ల అమ‌లు కోసం బోర్డుకు ఆరు నెల‌ల స‌మ‌యం ఇచ్చింది అత్యున్న‌త న్యాయ‌స్థానం. బోర్డు క‌చ్చితంగా మార్పును అంగీక‌రించాల‌ని, ఈ తీర్పు బీసీసీఐలో భారీ సంస్క‌ర‌ణ‌ల‌కు తావిస్తుంద‌ని తాము భావిస్తున్న‌ట్లు చీఫ్ జ‌స్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. బీసీసీఐలో మార్పుల‌ను లోధా పానెల్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించ‌నుంది.

ఇక బోర్డు గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌లో కాగ్ స‌భ్యుడికి స్థానం క‌ల్పించాల‌న్న లోధా క‌మిటీ సిఫార‌సును కూడా కోర్టు అంగీక‌రించింది. బీసీసీఐని ఆర్టీఐ ప‌రిధిలోకి తీసుకురావాలా వ‌ద్దా అన్న అంశాన్ని పార్ల‌మెంట్‌కు వ‌దిలేసింది సుప్రీంకోర్టు. దేశంలో బెట్టింగ్‌ను చ‌ట్ట‌బ‌ద్ధం చేయాల‌న్న క‌మిటీ సిఫార‌సును కూడా కోర్టు పార్ల‌మెంట్‌కే వ‌దిలేసింది. ఇది భార‌త క్రికెట్‌కు గొప్ప రోజ‌ని, సంస్క‌ర‌ణ‌ల‌ను సాధ్య‌మైనంత తొంద‌ర‌గా అమ‌లుచేయాల‌ని జ‌స్టిస్ లోధా అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ తీర్పుపై స్పందించ‌డానికి బోర్డు అధ్య‌క్షుడు అనురాగ్ ఠాకూర్ నిరాక‌రించారు. తీర్పు ప్ర‌తిని పూర్తిగా చ‌దివిన త‌ర్వాతే దీనిపై స్పందిస్తాన‌ని స్ప‌ష్టంచేశారు.