బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్
ముంబాయి అక్టోబర్ 04 (జనంసాక్షి):
భారత క్రికెట్ బోర్డు సరికొత్త అధ్యక్షుడుగా..మాజీ చైర్మన్, నాగపూర్ లాయర్ శశాంక్ మనోహర్ ఎంపికయ్యారు. బీసీసీఐకి రెండు విడతలుగా అసాధారణ సేవలు అందించిన జగ్ మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో…ఆయన వారసుడి ఎంపిక కార్యక్రమాన్ని ముంబైలో ముగిసిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో ముగించారు. 75 ఏళ్ల జగ్ మోహన్ ద్మాల్మియా హఠాన్మరణంతో ఆయన వారసుడిగా ..బోర్డు అధ్యక్షపదవి కోసం పలువురు ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
గంగూలి పేరు..
అధ్యక్షుడి ఎన్నికలో ఐసీసీ చైర్మన్ ఎన్ .శ్రీనివాసన్ కింగ్ మేకర్ కాబోతున్నారని ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్, బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరిల్లో ఎవరో ఒకరు అధ్యక్షస్థానానికి ఎంపికయ్యే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఒక దశలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు సైతం వినిపించింది. అయితే..ఇప్పుడు తాజాగా బోర్డు మాజీ అధ్యక్షుడు, విదర్భ క్రికెట్ సంఘానికి చెందిన శశాంక్ మనోహర్ పేరు బయటకు రావడమే కాదు దాల్మియాకు చెందిన ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల ప్రతినిధులు సంపూర్ణమద్దతు ప్రకటించడంతో ఎన్నిక కాకుండా ఎంపికతోనే తతంగం ముగిసింది. అన్నివర్గాలకు ఆమోదయోగ్యమైన అభ్యర్ధిగా శశాంక్ మనోహర్ ను ఖరారు చేశామని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ గత వారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక సమావేశానికి శ్రీనివాసన్ గైర్హాజరయ్యారు. అధ్యక్షపదవి కోసం శశాంక్ మనోహర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ ఏకపక్షమైపోయింది.
మొత్తం 30 ఓట్లు..
భారత క్రికెట్ బోర్డు అధ్యక్ష ఎన్నికలో మొత్తం 30 ఓట్లు ఉన్నాయి. ఇందులో శ్రీనివాసన్ వర్గం చేతిలో 10 ఓట్లు ఉంటే….కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, అరుణ్ జైట్లీ, శరద్ పవార్ వర్గాల చేతిలో మిగిలిన 20 ఓట్లు ఉన్నాయి. రాజస్థాన్ క్రికెట్ సంఘం ఓట్లు సస్పెన్షన్ లో ఉండడంతో..29 మంది సభ్యులు మాత్రమే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే పవార్, జైట్లీ, అనురాగ్ ఠాకూర్ వర్గాలు సంయుక్తంగా శశాంక్ మనోహర్ ను బలపరచడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యింది.
వివాదరహితుడు..
శశాంక్ మనోహర్ గతంలో..2008 నుంచి 2011 వరకూ బోర్డు అధ్యక్షుడిగా సేవలు అందించారు. వివాదరహితుడుగా ఉండటం, కష్టపడే తత్వం మరోసారి..శశాంక్ మనోహర్ ను బోర్డు అధ్యక్షుడిగా చేసింది. భారత క్రికెట్ బోర్డ్ చరిత్రలో..1928 నుంచి 30 మంది ప్రముఖులు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే పదవిలో ఉండి మృతి చెందిన బోర్డు తొలి అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా మాత్రమే. ఇప్పటికే పలు రకాలుగా సంక్షోభం ఎదుర్కొంటున్న బీసీసీఐకి దాల్మియా ఆకస్మిక మృతితో నెత్తివిూద మరో పిడుగుపడినట్లయ్యింది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో…వివాదరహితుడుగా పేరుపొందిన శశాంక్ మనోహర్ లాంటి వ్యక్తి బోర్డు అధ్యక్షుడుగా ఉండటం అవసరమని భావించామని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ విూడియాకు చెప్పారు.
2017 వరకు కొనసాగనున్న శశాంక్..
2008 నుంచి 2011 వరకూ బోర్డు అధ్యక్షుడుగా పని చేసిన సమయంలో శశాంక్ మనోహర్ పారదర్శకంగా వ్యవహరించి..చక్కటి వ్యక్తిగా పేరు తెచ్చుకొన్నారు. కష్టపడి పనిచేసే స్వభావం కూడా శశాంక్ మనోహర్ కు అదనపు అర్హతగా ఉపయోగపడింది. శశాంక్ మనోహర్ 2017 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు.