బీసీ డిక్లరేషన్‌పై మడమ తిప్పం : చంద్రబాబు
హైదరాబాద్,జూలై 24 (జనంసాక్షి) : బీసీ డిక్లరేషన్‌పై ఎటువంటి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గబోమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారంనాడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో చంద్రబాబును రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, యజ్ఞం మల్లేశ్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటినుంచి కృషి చేస్తోందన్నారు. బలహీన వర్గాలకు చట్టపరమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు సామాజిక న్యాయం జరగాలన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ బీసీలకు 100 సీట్లు ప్రకటించిన తర్వాత కూడా పార్టీల్లో చలనం లేదన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుందో ఇంకా స్పష్టం చేయకపోవడం విచారకరమన్నారు. ములాయంసింగ్, నితీష్‌కుమార్ వంటి నేతలను కలుపుకుని బీసీల సమస్యల పరిష్కారం కోసం,చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. బీసీలకు కేటాయించే సీట్లను ఆరు నెలలు లేదా సంవత్సరం ముందే ప్రకటిస్తామని చెప్పారు.