బీహార్‌కు డబుల్ ధమాకా
– అభివృద్ధి కోసం భాజపాకు ఓటు వెయ్యండి
– ఎన్నికల ప్రచారంలో మోడీ
పాట్నా / రాంచీ అక్టోబర్2(జనంసాక్షి):
బిహార్ ప్రజలు ఈ సారి రెండు దీపావళి పండగలు చేసుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకటి పండగ రోజు (దీపావళి).. మరొకటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు అని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం బిహార్‌లోని బంకాలోని జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ ప్రసంగించారు.ఇటీవల తాను అమెరికా పర్యటనకు వెళ్లినపుడు అక్కడి
బిహార్ ప్రజలు.. బిహార్‌ను మార్చాలని కోరారని మోదీ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శించారు. బిహార్‌కు
ఉద్యోగాలు, అభివృద్ధి పథకాలు కావాలని అన్నారు. బిహార్ కు లక్షా 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని
కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ అది ప్రజల హక్కు అని మోదీ చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించాలని మోదీ కోరారు. ఈ నెల 12 నుంచి ఐదు దశల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
విద్యుత్ పొదుపును అలవర్చుకోవాలి: ప్రధాని
దేశంలో ప్రతీ ఒక్కరూ విద్యుత్ పొదుపునకు ప్రయత్నించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం జార్ఖండ్‌లోని ఖుంతీలో పూర్తిగా సౌరశక్తిని వినియోగించుకునే న్యాయస్థానాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పొదుపు వల్ల డబ్బు ఆదాకావడంతో పాటు భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. సౌరశక్తి వినియోగం వల్ల సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఒత్తిడి తగ్గుతుందని మోదీ గుర్తు చేశారు. జార్ఖండ్‌లో ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖుంటిలో సోలార్ పవర్ ప్రాజెక్టును మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్ శాంతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఐరాసలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామని గుర్తు చేశారు. ఐరాసలో గ్లోబల్ వార్మింగ్‌పై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిందని తెలిపారు. పర్యావరణం మార్పులకు భారత్ ఏ మాత్రం కారణం కాదని పేర్కొన్నారు. ప్రకృతిని నాశనం చేసే పనులు భారత్ ఎప్పుడూ చేయలేదు అని చెప్పారు. భూతాపానికి భారతదేశం కారణం కాదని అయినా భూతాపాన్ని తగ్గించేందుకు మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామని ఆయన అన్నారు. సాంప్రదాయ విద్యుత్ వనరులు అందుబాటులో ఉన్న జార్ఖండ్‌లో ప్రజలు సౌరశక్తి కోసం ప్రయత్నించడం ముదావహం అని అన్నారు. విద్యుత్ పొదుపు చేసేందుకు అనేక పరికరాలు వచ్చాయని జనం వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం విధిగా పరిగణించాలని ప్రధాని మోదీ కోరారు. సిఎం రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.