బీహార్‌లో మహాకూటమిదే గెలుపు – రాహుల్‌గాంధీ

 

పట్నా,నవంబరు 4 (జనంసాక్షి): వ్యవసాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. బిహార్‌ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన అరారియాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రైతులు తమ ఉత్పత్తిని దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అని మోదీ చెబుతున్నారు. కాబట్టి నేను మోదీని ఒక్కటే అడగదలచుకున్నా. రైతులు దేశంలో ఎక్కడైనా వెళ్లి పంటను అమ్ముకోవాలంటే ముందు రహదారులు ఉండాలి కదా. మరి బిహార్‌లో రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన రహదారులు ఉన్నాయా?’ అని రాహుల్‌ ప్రశ్నించారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ లను ఉద్దేశిస్తూ ‘అవి ఈవీఎంలు కాదని.. మోదీ ఓటింగ్‌ మెషీలు’ అని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం బిహార్‌ యువత ఎంతో కోపంగా ఉన్నారని.. అవి ఈవీఎంలు అయినా ఎంవీఎంలు అయినా మహాకూటమే గెలుస్తుందని అన్నారు. సత్యం, న్యాయం ఎప్పటికీ ఒకేలా ఉంటాయి.. ఆ వ్యక్తి భావజాలానికి, ఆలోచనలకి వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని.. వారి ఆలోచనలపై విజయం సాధిస్తామని అన్నారు. నరేంద్రమోదీని ఓడించేవరకు తాను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను అని రాహుల్‌ పేర్కొన్నారు. అదేవిధంగా రాహుల్‌ తాజాగా ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల పరిస్థితిపై ఓ వీడియో విడుదల చేశారు. లాక్‌డౌన్‌ విధించిన సమయంలో కేంద్రం, బిహార్‌ ప్రభుత్వం వలస కార్మికులపై చూపిన వివక్ష కారణంగా వారంతా బలవంతంగా కాలినడకన స్వస్థలాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేనప్పటికీ వలస కార్మికులకు సహాయం చేసిందని గుర్తుచేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.. ఎప్పటికీ కార్మిక సోదరులకు సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. కాగా బిహార్‌లో మంగళవారం రెండో దశ శాసనసభ ఎన్నికలు పూర్తయ్యాయి. నవంబర్‌ 7న మూడో విడత ఎన్నికల నిర్వహణతో ముగియనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 10న వెలువడనున్నాయి.