బీహార్‌లో రీకౌంటింగ్ కోసం నెటిజన్ల డిమాండ్
పాట్నా,నవంబర్13 (జనంసాక్షి) : బిహార్ ఎన్నికల ఫలితాలపై సోషల్ విూడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓట్ల లెక్కింపు మళ్లీ జరగాలంటూ నెటిజన్లు భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్‌లో (బిహార్ రీకౌంటింగ్ కోరుతోంది)’ అనే హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ట్రెండింగ్‌లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై దాదాపు లక్షన్నర మందికి పైగా ట్వీట్లు చేశారు. ‘స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయని, ఎన్నికల సంఘంపై ఉన్న విశ్వాసం సన్నగిల్లుతోందని, ప్రజల నమ్మకాన్ని పొందాలంటే బిహార్‌లో మళ్లీ ఓట్ల లెక్కింపు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి (మహాగట్‌బంధన్) విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెప్పటినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే విజయం సాధించింది. 125 స్థానాలతో ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకోగా మహాకూటమి 110 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలపై మహాఘట్‌బంధన్ పార్టీలు మండిపడుతున్నాయి. ఆర్జేడీ నేత తేజ్వి యాదవ్ మాట్లాడుతూ ”ప్రజలు మాకు ఓట్లు వేస్తే, ఫలితాలను ఎన్డీయేకు అనుకూలంగా విడుదల చేశారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఓట్ల శాతంలో మహాగట్‌బంధన్ ముందు ఉన్నప్పటికీ ఎన్డీయేకు ఎక్కువ సీట్లు రావడం ఏంటని ప్రతిపక్ష నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా స్థానాల్లో తక్కువ మెజారిటీతో ఎన్డీయే అభ్యర్థులు గెలవడంపై ఆర్జేడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిళ్లకు తలొగ్గే ఎన్డీయే అభ్యర్థులను విజేతలుగా ప్రకటించారని ట్విట్టర్ ద్వారా తేజస్వీ యాదవ్ అన్నారు. ఇదే విషయమై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. బీజేపీకి వచ్చే ఓట్ల శాతానికి సీట్లకు సంబంధం లేదని, ఇందులో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదని, ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద సవాల్ అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే బిహార్‌లో ఓట్ల కౌంటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో కౌంటింగ్ మొదలైన కొద్ది గంటలకే ఆర్జేడీ నేత మనోజ్ ఝా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అప్పుడే ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా విూడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. కౌంటింగ్‌లో కానీ, ఈవీఎంలలో కానీ ఎలాంటి పొరపాట్లు జరగడం లేదని సమాధానమిచ్చారు.