బీహార్‌ ఎగ్జిట్‌పోల్స్‌ను గుర్తుకు తెచ్చుకోండి

బిజెపికి తేజస్వి యాదవ్‌ చురక
పాట్నా,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): గుజరాత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌పై మురిసిపోకుండా గతంలో జరగిన బీహార్‌ ఎన్నికల ఫలితాలను జ్ఞాపకం చేసుకోవాలని బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ భారతీయ జనతా పార్టీని హెచ్చరించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను నమ్మకూడదని అందరికీ సలహా ఇచ్చారు. 2015లో జరిగిన బిహార్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలే దీనికి చక్కని ఉదాహరణ అని తెలిపారు. బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని 2015లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తెలిపాయి. వివిధ సంస్థలు వెల్లడించిన ఈ ఫలితాలు ఆర్జేడీ, కాంగ్రెస్‌, జేడీయూ మహా కూటమికి వ్యతిరేకంగా కనిపించాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఉంటుందని ఒక సంస్థ మాత్రమే తెలిపింది. బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కబోతున్నాయని టుడేస్‌ చాణక్య అనే సంస్థ చెప్పింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టుడేస్‌ చాణక్య క్షమాపణ చెప్పవలసిన పరిస్థతి ఏర్పడింది. బీజేపీ పరాజయం పాలై, మహా కూటమి విజయం సాధించింది. తాజాగా గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని 7 సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చెప్తున్నాయి. బీజేపీ 2012లో సాధించిన 115 స్థానాల కన్నా ఇప్పుడు తక్కువ వస్తాయని మూడు సంస్థలు తెలిపాయి. రెండు సంస్థలు పెద్దగా మార్పు ఉండదని చెప్పాయి. 2002లో బీజేపీకి 127 స్థానాలు వచ్చాయని, ఇది రికార్డు అని, తాజాగా ఆ పార్టీ ఈ రికార్డును అధిగమిస్తుందని రెండు సంస్థలు చెప్పాయి. దీనిపై తేజస్వి యాదవ్‌ స్పందించారు. బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ను గుర్తు చేస్తూ, ట్వీట్‌ చేశారు.