బీహార్‌ ఫలితాలతో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం

ఇక్కడ గెలిస్తేనే జాతీయస్థాయిలో మళ్లీ పట్టు
పాట్నా,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): బీహార్‌ తొలిదశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మిగతా పార్టీలకు ఎలా ఉన్నా ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ భవిష్యత్‌పైనా ప్రభావం చూపనున్నాయి. ఇక్కడకూటమి కట్టినా తేజ్వీ యాదవ్‌ అధికారంలోకి రాగలిగితే కాంగ్రెస్‌కు కొంతయినా పట్టు దక్కుతుంది. బిజెపికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సవిూకరించలేకపోతున్న కాంగ్రెస్‌ ఇక్కడ మంచి ఫలితాలు రాబడితేనే జాతీయస్థాయిలో పుంజుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌ గాంధీతో గొంతు కలిపే సీనియర్‌ నేతలు అంతగా లేకపోవడం ఇందుకు ఒక కారణమైతే కాంగ్రెస్‌ పార్టీకి ఒక బలమైన నాయకుడంటూ కనపడకపోవడం మరో కారణం.  ఏ పరిస్థితినైనా తనకు అనుకూలంగా మలుచుకుని ప్రజల్లో తనపై అభిమానం చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకునే అవసరం ఏర్పడింది. ప్రధాని నరేంద్రమోదీ ఛరిష్మాను  తిప్పిగొట్టగల వ్యూహరచన కాంగ్రెస్‌ చేయకలేకపోతోంది. 2019 ఎన్నికల్లో రెండవసారి పరాజయం చెందాక కాంగ్రెస్‌ అంతటా నీరుగారింది.  కనీసం వంద సీట్లు కూడా దాటకుండా కేవలం 52 సీట్లకు పరిమితం కావడం కాంగ్రెస్‌ను కుదేలు చేస్తే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని రాహుల్‌ అస్త్రసన్యాసం చేయడం పార్టీని మరింత నైరాశ్యంలో ముంచేసింది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ వ్యూహకర్తలు ఆ పార్టీ ప్రభుత్వాలను కుప్పకూల్చడంలో ఆరితేరారు.  ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవడం, సీనియర్‌ నేతల్ని సైతం ఆకర్షించడంతో కాంగ్రెస్‌ పునాదులను దెబ్బతీస్తున్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు రకరకాల ఆయుధాలు ప్రయోగించడంతో ఆ పార్టీ అగమ్యగోచర పరిస్థితిలో పడింది. ప్రియాంక,రాహుల గాంధీలు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడా సఫలం కావడం లేదు. అందుకే బీహర్‌లో పొత్తులకు దిగిన గట్టి పట్టు సాధిస్తే, మంచిదన్న భావనలో పార్టీ నేతలు ఉన్నారు. ఇక్కడ నితీశ్‌ ఓడిపోతే కాంగ్రెస్‌కు పాలుపోసినట్లు అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుత్సిత రాజకీయాలు ఆ పార్టీ వ్రేళ్లను చెదపురుగులుగా ఎప్పుడూ పట్టి పీడిస్తుంటాయి. పైకి ఆ పార్టీని గాంధీ కుటుంబం నడిపిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అక్కడ నేతలు ఒకర్ని మరొకరు తొక్కేందుకు, ఒకరి కాళ్లను మరొకరు లాగేందుకు ప్రయత్నిస్తుంటారు. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని అమలు చేయకుండా ఉండేందుకు, చేసినా సాధ్యమైనంత మేరకు ఆలస్యం చేసేందుకు రాజకీయాలు సాగుతుంటాయి. సోనియాగాంధీ చేతుల నుంచి రాహుల్‌ గాంధీ చేతుల్లోకి పగ్గాలు వచ్చినా వాటిని నిలుపుకుని పార్టీకి జవసత్వాలు అందించడంలో విఫలం అయ్యారు. 2014లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీలో ఆశాజనక పరిస్థితుల కానరావడం లేదు. అనారోగ్యంతో ఉన్న సోనియా సుదీర్ఘ కాలం విదేశాల్లో ఉన్న సమయంలో ఒక స్తబ్దత
నెలకొన్నది. నిజానికి అప్పటికే రాజకీయాల పట్ల నిరాసక్తంగా ఉన్న రాహుల్‌ పగ్గాలు చేపట్టేందుకు అంత ఆసక్తి ప్రదర్శించలేదు. దీనికితోడు మోడీ సుడిగాలిలో కాంగ్రెస్‌ కొట్టుకుపోయింది. మోదీ రాకతోనే  కాంగ్రెస్‌ పని ముగిసింది. పార్టీని ఏదోరకంగా కాపాడేందుకు సోనియా శాయశక్తులా పని చేయవలిసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్‌ గాంధీ పగ్గాలు చేపడితే మాత్రం ఏమి చేయగలరన్న భావన సర్వత్రా ఉంది. అయినా రాహుల్‌ తప్పటడుగు లతోనే తన పని ప్రారంభించారు. దేశ సమస్యల గురించి అధ్యయనం చేసినా ఆయన తన భావాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ను మార్చుకోవడం సాధ్యపడలేదు. దేశంలో రాజకీయ సామాజిక మార్పులు ఉధృతంగా సంభవిస్తూ పార్టీని అందుకు అనుగుణంగా మార్చుకోవాల్సిన తరుణంలో రాహుల్‌ వేయాల్సిన అడుగులు వేయలేకపోయారు. ఇతర నాయకులను పైస్థాయికి ప్రోత్సహించగలిగిన సంప్రదాయం కాంగ్రెస్‌ పార్టీలో లేనందువల్లే అది ఒక కుటుంబ పార్టీగానే ప్రజలు గుర్తించారు.  ఈ దశలో బీహార్‌లో ఏ మాత్రం అవకాశం వచ్చినా పార్టీకి పునరుజ్జీవం పోస్తుంది.