బీహార్‌ ఫలితాలతో కాంగ్రెస్‌కు కుదుపు

తమిళనాట కూడా ప్రభావం చూపుతుందన్న భావన

కాంగ్రెస్‌ను పెద్దగా పట్టించుకోవద్దంటున్న డిఎంకె నేతలు

చెన్నై,నవంబర్‌17(జ‌నంసాక్షి): బీహార్‌లో పేలవ ఫలితాలు సాధించిన కాంగ్రెస్‌కు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇందులో ముందుగా తమిళనాట ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన పార్టీ నాయకుల్లో ఉంది. ఖుష్బూ లాంటి నేతలు బయటకు వెళ్లడంతో పార్టీకి ప్రచారం చేసే వారు కరువయ్యారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల ఆశలపై బిహార్‌ ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లేలా ఉన్నాయి. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌కు గతం కంటే తక్కువ సీట్లు మాత్రమే దక్కనున్నాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించినంతగా ఫలితాలు రాకపోవడంతో డీఎంకే అధిష్ఠానం రాష్ట్రంలో ఆ పార్టీకి తక్కువ సీట్లు కేటాయించాలని భావిస్తోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వ పాలనపై రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిచి అధికారంలోకి రావటం ఖాయమని భావిస్తున్నారు. ఈ దశలో కాంగ్రెస్‌ను పెద్దగా ప్రోత్సహించరాదని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు గతం కంటే ఎక్కువ సీట్లు ఇస్తే తప్పకుండా గెలుస్తుందని స్థానిక కాంగ్రెస్‌ నాయకులు డీఎంకే అదిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బిహార్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ డీఎంకే కూటమిలో 50 సీట్ల కోసం పట్టుబట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం బిహార్‌ ఎన్నికల ఫలితాలు తమ పథకానికి గండికొట్టాయని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో లభించినట్టు ఈసారి 40 సీట్లయినా కేటాయిస్తారో లేదో అని కాంగ్రెస్‌ నాయకులు అయోమయంలో పడ్డారు. బిహార్‌లో ఆర్జేడీ కూటమిలోని కాంగ్రెస్‌ 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి 19 చోట్ల మాత్రమే గెలిచింది. అంతే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఓటమి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆర్జేడీ ఆశలను అడియాసలు చేసింది. ఈ పరిస్థితి తమిళనాట ఏర్పడ కూడదని డీఎంకే అధిష్ఠానం భావించి ఆ దిశగా ఈసారి కాంగ్రెస్‌కు గతం కంటే తక్కువ సీట్లను మాత్రమే కేటాయించేందుకు సిద్ధమవుతోంది. 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో ఆర్జేడీకి ఎదురైన పరిస్థితే డీఎంకేకు ఎదురైంది. ఎన్నికల సమయంలో డీఎంకే అధిష్ఠానం కాంగ్రెస్‌ పార్టీకి 40 సీట్లు కేటాయించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎనిమిది చోట్ల మాత్రమే గెలిచింది. ఈ కారణంగా డీఎంకే 90 స్థానాలలో గెలిచినా కాంగ్రెస్‌ ఘోరపరాజయం కారణంగా మెజారిటీ లేక అధికారానికి దూరమైంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించే విషయమై డీఎంకే కొద్ది నెలలుగా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 20 సీట్లు మాత్రమే కేటాయించాలని డీఎంకే సీనియర్లు నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కోరుతున్నారు. ఎట్టిపరి స్థితుల్లోనూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినట్లు 40 సీట్లు కేటా యించకూడదని కూడా గట్టిగా చెబుతున్నారు. గతేడాది 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకే 13 స్థానాల్లో మాత్రమే గెలిచిందని, మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు నుంచి డీఎంకే అభ్యర్థులకు ఓట్లు పడలేదని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో 15 సీట్లలో డీఎంకే గెలిచి వుంటే అన్నాడీఎంకే ప్రభుత్వం మెజారిటీ లేక పతనమై, డీఎంకే అధికారంలోకి వచ్చి వుండేదని డీఎంకే సీనియర్‌ నాయకులు తెలిపారు. ఈ అంశాలను నిశితంగా పరిశీలించి కాంగ్రెస్‌కు సీట్లను కేటాయించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా స్టాలిన్‌కు వారు సూచిస్తున్నారు. బిహర్‌ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని డీఎంకే కూటమిలో తమ పార్టీకి తక్కువ సీట్లు కేటాయిస్తే ఏం చేయాలన్న ఆలోచనలో స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.