బీహార్‌ లో వరదల బీభత్సం

24 గంటల్లో 42 మంది మృతి

పాట్నా,ఆగస్టు28 : వరదలు ఉత్తరాదిన పలు రాష్టాల్ల్రో బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌ లలో వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. బీహార్‌లో గడిచిన 24 గంటల్లో 42 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 482కి చేరింది. 19 జిల్లాల పరిధిలోని 1.72 కోట్ల మంది ఇంకా వరద ముంపులోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ విపత్తు నివారణ సంస్థకు చెందిన 28 బృందాలు, 630 మంది సైనికులు వివిధ బృందాలుగా విడిపోయి పునరావాస, సహాయక చర్యలు చేపడుతున్నారు. బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీటిముంపులోనే ఉన్నాయి. అయితే వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. యూపీలో గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 101కి చేరింది. యూపీలోని 2వేల గ్రామాల్లో వరద ప్రభావం తగ్గగా 3వేలకు పైగా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.