బురదతోనే కాలనీ వాసుల సహవాసం
ఇళ్లు శుభ్రం చేసుకునే పనిలో నిత్యం బిజీ
పక్షం రోజులైనా గాడిన పడని జీవితం
వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం
హైదరాబాద్,అక్టోబర్27(జనంసాక్షి): కుండపోత వానలతో అతలాకుతలమైన హైదరాబాద్ లోని పలు కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఎవరికి వారు తమ ఇళ్లను, ఇంటిముందు వీధులను శుభ్ర చేసుకునే పనిలో పడ్డారు. అనేక కాలనీల్లో ఇంకా రెండు, మూడు అడుగుల మేర నీళ్లు నిలిచిఉండగా.. వందల సంఖ్యలో కాలనీలు, అక్కడి ఇండ్లు బురదతో నిండిపోయి ఉన్నాయి. దాదాపు రెండు వారాలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. తమకు సర్కారు సాయం అందడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. కాలనీల్లోని రోడ్లపైనే కాదు.. ఇండ్లలోనూ ఒకటి రెండు ఫీట్ల మేర బురద పేరుకుని ఉండటంతో క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు. లక్షల విలువ చేసే సామాన్లు కొట్టుకుపోయాయని, తినడానికి తిండి కూడా లేదని ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న సర్కారు కొన్ని కాలనీలనే పట్టించుకుంటోందని.. చాలా కాలనీల పరిస్థితి దారుణంగా ఉందని బాధితులు వాపోతున్నారు. వానలు ఆగిపోయి వారం అవుతున్నా బురద తొలగించడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులు రాలేదని మండిపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ వాళ్లను అడిగితే పండుగ సెలవులని అంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బురదను జేసీబీలు, ట్రాక్టర్ల ద్వారా తొలగిస్తున్నామని.. ఇండ్లలో బురద క్లియర్ చేసుకోవడానికి స్వచ్చంద సంస్థల వాళ్లు, ప్రతిపక్షాల కార్యకర్తలు సాయపడుతున్నారని చెప్తున్నారు. స్వచ్చంద సంస్థల వాళ్లు, స్థానికులు ఇస్తున్న ఫుడ్ తింటున్నామని అంటున్నారు. భారీ వర్షానికి వరద ముంచెత్తడంతో చాలా కాలనీల్లో జనం కట్టుబట్టలతో బయటికి వచ్చారు. షేక్ పేట, టోలిచౌకి, చాదర్ ఘాట్, ఫలక్ నుమా వంటి ఏరియాల్లోని కాలనీల్లో ముంపు తగ్గినా బురద పేరుకుపోయింది. విూర్‌పేట, సరూర్ నగర్ వంటి ప్రాంతాల్లో కొన్ని కాలనీలు ముంపులోనే ఉన్నాయి. వేల కుటుంబాలు వరద నీళ్లకు ఆగమైపోయాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పొద్దంతా బురద, చెత్త క్లీన్ చేసుకుంటున్నాం.. రాత్రి కాగానే చుట్టాల ఇంటికి పోతున్నమని చెబుతున్నారు.
లాక్ డౌన్ వల్ల పనులు లేక ఆర్థికంగా దెబ్బతిన్న మాకు ఇప్పుడు ఇంట్లో సామానంతా పోయింది. టేబుల్స్, బీరువాలు, బెడ్ లు, బట్టలు అన్ని పాడైపోయాయి.తామే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నట్లు తెలిపారు.
భారీ వానల కారణంగా వరదలో మునిగిపోయిన వెహికల్స్ షెడ్లకు చేరాయి. బైకులు, ఆటోలు, కార్లు అనే తేడా లేకుండా లోతట్టు ప్రాంతాల్లోని వెహికల్స్ అన్నీ పాడయ్యాయి. కొన్నిచోట్ల కొట్టుకుపోయి పనికి రాకుండా పోయాయి. రిపేర్లకు వేలల్లో ఖర్చవుతుండగా ఓనర్లకు ఆర్థిక భారంగా మారింది. ఇన్సూరెన్స్ ఉన్న వెహికల్స్ వారు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కంపెనీలు రూల్స్ పేరిట కొర్రీలు పెడుతున్నాయి.
రిపేర్లకు వేల రూపాయల్లో ఖర్చు అవుతోంది. టూ వీలర్లకు రూ.3 వేల నుంచి రూ.15 వేలు, ఆటోలకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు, కార్లకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అవుతోంది. మునిగిన వెహికల్స్‌లో ఇంజిన్ ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉంటున్నాయని మెకానిక్‌లు చెబుతున్నారు. వరదల కారణంగా దాదాపు 2.4లక్షల ఆటోలు, కార్లు, 5 లక్షల బైకులు నీట మునిగాయనే అంచనా ఉంది. వరదల్లో కొట్టుకుపోయిన వెహికల్స్‌కు కొన్ని కంపెనీలు పరిహారం ఇస్తుండగా, మరికొన్ని కంపెనీలు ఇవ్వడం లేదు.
ఇప్పటికీ అన్ని సర్వీసింగ్ సెంటర్లలో ఫుల్‌గా ఉన్నాయి. దీంతో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో
రొటీన్ సర్వీసింగ్ పనులు చేయలేకపోతున్నారు. నీట మునిగిన ఆటోల డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, సిటీలో చాలా మంది ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ చెల్లించే స్థోమత కూడా లేదని వాపోతున్నారు. పాడైన ఆటోల ఖర్చులను ప్రభుత్వం భరిస్తేనే ఆర్థికంగా నిలబడతారని అన్నారు.