బూస్టర్ డోసుపై తొందరవద్దు
` అలా చేస్తే మహమ్మారిని మరింతకాలం పొడిగించినట్లే..!
` ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన
వాషింగ్టన్,డిసెంబరు 23(జనంసాక్షి):విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ భయంతో పలు దేశాలు బూస్టర్ డోసును పంపిణీని మొదలుపెట్టాయి. అయితే, నిరుపేద దేశాలు కనీసం ఒక్క డోసు కూడా అందించలేక ఇబ్బంది పడుతుంటే సంపన్న దేశాలు మాత్రం మూడో డోసు అందించడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అసమానతలు మరింత దిగజారిపోవడమే కాకుండా మహమ్మారిని మరింత కాలం పొడిగించినట్లే అవుతుందని హెచ్చరించింది.‘ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. వ్యాక్సిన్ తీసుకోని వారిలోనే ఎక్కువ ఆస్పత్రిలో చేరికలు, మరణాలు చోటుచేసుకుంటున్నాయి. బూస్టర్ డోసు తీసుకోని వారిలో కాదు. ఇలా ఏకపక్షంగా వెళ్లి ఏ దేశం కూడా ఈ మహమ్మారిని జయించలేదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ హెచ్చిరించారు. వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చి ఏడాది కావొస్తున్నా ఇప్పటికీ ఆఫ్రికాలో ప్రతి నలుగురు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో కేవలం ఒక్కరికి మాత్రమే వ్యాక్సిన్ అందిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా వ్యాక్సిన్ లభ్యతలో అసమానతల వల్ల ఎన్నో ప్రాణాలకు ముప్పు ఉందని.. అయినప్పటికీ కొన్ని దేశాలు బూస్టర్ డోసుకు ఎందుకు పరుగెడుతున్నాయని ప్రశ్నించారు. ఇలా వ్యాక్సిన్ అసమానతను కొనసాగిస్తే వైరస్ మరింత వ్యాప్తి చెందడానికి, మరిన్ని మ్యుటేషన్లకు అవకాశం ఇచ్చినట్లేనని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చి ఏడాది కావస్తున్నా కేవలం ధనిక దేశాలు మాత్రమే విస్తృత వేగంతో పంపిణీ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా తయారవుతోన్న కొవిడ్ వ్యాక్సిన్‌లలో 73శాతం డోసులు కేవలం ధనిక, ఉన్నత మధ్య ఆదాయ దేశాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అల్ప ఆదాయ దేశాల్లో 0.9శాతం డోసులు మాత్రమే పంపిణీ చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, ఈయూ దేశాలు బూస్టర్ డోసును అందించడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది