బెంగళూరును అధిగమించిన హైదరాబాద్‌..

బెంగళూరును అధిగమించిన హైదరాబాద్‌..

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ.. హైదరాబాద్‌లో తమ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఐడీసీ లేదా కేపబులిటీ సెంటర్‌)ను ఏర్పాటు చేసింది. దీన్ని బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. టెలివిజన్‌, సినిమా, స్ట్రీమింగ్‌ రంగాల్లో అనేక ప్రతిష్ఠాత్మక బ్రాండ్లు వార్నర్‌ బ్రదర్స్‌ సొంతమన విషయం తెలిసిందే. అయితే వార్నర్‌ మీడియా, డిస్కవరీ సంస్థలు విలీనమై వార్నర్‌ బ్రోస్‌. డిస్కవరీగా అవతరించాక ఆసియాలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్‌ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక సంస్థ వార్నర్‌ బ్రోస్‌ తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇందుకు సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ, అవసరమైన అన్ని సహాయ, సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం మరింత అభివృద్ధి చెందేందుకు వార్నర్‌ బ్రోస్‌. డిస్కవరీ దోహదం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఐడీసీతో కొత్తగా 1,200 ఉద్యోగావకాశాలు రానున్నాయి. కాగా, ప్రకటించిన నాలుగు నెలల్లోనే దీన్ని తెచ్చారని పేర్కొంటూ, ఈ ఏడాది మేలో తన అమెరికా పర్యటన సందర్భంగా న్యూయార్క్‌లో సంస్థకు చెందిన సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలెగ్జాండ్రా కార్టర్‌తో భేటీని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో తమ ఐడీసీని ఏర్పాటు చేయనున్నట్టు నాడు ఆమె ప్రకటించారన్నారు.

తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరిస్తూ.. రాష్ట్రం ఏర్పడే నాటికి ఇక్కడ 3,23,000 ఐటీ ఉద్యోగాలు మాత్రమే ఉండగా, కరోనా వంటి ప్రతికూల పరిస్థితులనూ దాటి నేడు సుమారు 10 లక్షలకు పెరిగినట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణలో ఉద్యోగావకాశాలు మూడు రెట్లు, ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 33 శాతం, 2022-23లో 44 శాతం ఐటీ ఉద్యోగాలు పెరిగాయని, అంతేగాక 2023 ప్రథమార్ధంలో గ్లోబల్‌ క్యాపబులిటీ సెంటర్లలో బెంగళూరును హైదరాబాద్‌ అధిగమించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే డిస్కవరీ చానెల్‌, మ్యాక్స్‌, డిస్కవరీ+, సీఎన్‌ఎన్‌, డీసీ, యూరోస్పోర్ట్‌, హెచ్‌బీఓ, హెచ్‌జీటీవీ, ఫుడ్‌ నెట్‌వర్క్‌, ఓడబ్ల్యూఎన్‌, ఇన్వెస్టిగేషన్‌ డిస్కవరీ, టీఎల్‌సీ, మ్యాగ్నోలియా నెట్‌వర్క్‌, టీఎన్‌టీ, టీబీఎస్‌, ట్రూ టీవీ, ట్రావెల్‌ చానల్‌, మోటర్‌ ట్రెండ్‌, యానిమల్‌ ప్లానెట్‌, సైన్స్‌ చానల్‌ తదితర వార్నర్‌ బ్రోస్‌ డిస్కవరీ బ్రాండ్లను ప్రస్తావించిన మంత్రి

ఇటువంటి ప్రఖ్యాత బ్రాండ్లతో 220 దేశాలు, 50 భాషల్లో వార్నర్‌ బ్రోస్‌ డిస్కవరీ గ్రూపు విస్తరించినట్టు చెప్పారు. యాపిల్‌, అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, సేల్స్‌ఫోర్స్‌, ఊబర్‌, నోవార్టీస్‌, క్వాల్‌కామ్‌, వెల్స్‌ ఫార్గో, మిక్రాన్‌ తదితర ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌లో తమ రెండో ప్రధాన కార్యాలయాలను నెలకొల్పినట్టు మంత్రి కేటీఆర్‌ వివరించారు. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ సీఎఫ్‌వో గున్నార్‌ వీడెన్‌ఫెల్స్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలెగ్జాండ్రా కార్టర్‌, హైదరాబాద్‌ ఐడీసీ హెడ్‌ జైదీప్‌ అగర్వాల్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌, తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్స్‌ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఐటీఈఅండ్‌సీ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాధ్‌ రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

మహిళా కోటా కోసం నా సీటును వదులుకోవడానికీ సిద్ధంగా ఉన్నా. మహిళా రిజర్వేషన్‌ బిల్లును స్వాగతిస్తున్నా. మహిళలకు కోటా కావాల్సిందే.