బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం చివాట్లు

 

– పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని ఓ రాష్ట్రం ఎలా ప్రశ్నిస్తుంది..?

– వివరించేందుకు విూ సీఎంనే కోర్టుకు రమ్మనండన్న కోర్టు

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ఆధార్‌ పిటిషన్‌ విషయంలో పశ్చిమబెంగాళ్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్టాల్రు పిటిషన్‌ ఎలా వేస్తాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలని సూచించింది. నిజానికి ఇది పరిశీలించాల్సిన అంశమే అయినా.. ఓ రాష్ట్రం ఎలా సవాలు చేస్తుందో తమకు వివరించాలని కోర్టు స్పష్టంచేసింది. వ్యక్తిగతంగా రమ్మనండి.. విూ మమతా బెనర్జీనే రమ్మనండి అని కోర్టు తేల్చి చెప్పింది. ఏకే సిక్రీ, అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం బెంగాల్‌ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. అటు ఈ అంశం కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీస్‌ జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. ఏం చేస్తారో చేసుకోండి.. నా మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌తో లింకు చేయను అని ఈ మధ్యే మమతా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఇలా స్పందించడం ఆమెకు మింగుడు పడనిదే. నిజానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంలో రిట్‌ పిటిషన్‌ను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసింది. దీని ప్రకారం తన ప్రాథమిక హక్కులకు రాజ్యం భంగం కలిగిస్తుందని భావించినపుడు ఓ పౌరుడిగా మాత్రమే సుప్రీంకోర్టులో దానిని సవాలు చేసే అవకాశం ఉంటుంది. అంతేగానీ ఓ రాష్ట్రం ఇలా చేయడానికి వీల్లేదు. అందుకే కోర్టు విూ సీఎంనే వ్యక్తిగతంగా ఓ సాధారణ పౌరురాలిగా కోర్టుకు రమ్మనండి అని కోర్టు స్పష్టంచేసింది. బెంగాల్‌ ప్రభుత్వం తరఫున వాదించిన కపిల్‌ సిబల్‌ను కూడా కోర్టు మందలించింది. విూరు మాకంటే అనుభవజ్ఞులు.. విూకు ఈ విషయం తెలిసి ఉండాలి కదా అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.