బెంగాల్ వర్సెస్ భాజపా
– ముదురుతున్న వివాదం
దిల్లీ/ కోల్‌కతా,డిసెంబరు 11 (జనంసాక్షి): భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై గురువారం బెంగాల్‌లో జరిగిన దాడి ఘటన కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య తీవ్ర మాటల యుద్ధానికి తెరలేపింది. దాడికి పాల్పడింది తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులేనని భాజపా ఆరోపిస్తుండగా. . ఆ పార్టీ నాటకాలాడుతోందని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంపై కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్ షాకు సమగ్ర నివేదికను సమర్పించాలని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 14న హాజరు కావాలంటూ కేంద్ర ¬ంశాఖ అధికారులు.. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కేంద్రం సమన్లు జారీ చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని.. సీఎస్, డీజీపీ కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి ఎదుట హాజరు కాబోరంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.జడ్ కేటగిరీ భద్రత కలిగిన వాళ్లకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు బెంగాల్ సీఎస్ అల్పన్ బందోపాధ్యాయ్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. నడ్డా కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారు, పైలట్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే, డైమండ్ హార్బర్‌కు వెళ్లే దారిలో భారీగా పోలీసు బలగాలను మోహరించిన విషయాన్ని లేఖలో సీఎస్ వివరించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు. మూడు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయగా.. అందులో ఒక ఎఫ్‌ఐఆర్ భాజపా నేతపై ఉంది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం: అమిత్ షా
తృణమూల్ కాంగ్రెస్ పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలతో బెంగాల్ చీకటియుగంలోకి వెళ్లిందని కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. బెంగాల్‌లో రాజకీయ హింసను సంస్థాగతం చేసి తీవ్రస్థాయికి తీసుకురావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఈ హింసాత్మక ఘటనలకు కారణమైన కారణమైన ప్రభుత్వం.. శాంతికాముకులైన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
భాజపాది రాజకీయ కుట్ర: మమత
భాజపా చేస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో స్పందించారు. భాజపానే దాడులు చేయించి తిరిగి తమ పార్టీ కార్యకర్తలపై నిందలు మోపుతోందన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, సీఎస్, డీజీపీలకు కేంద్ర ¬ంశాఖ సమన్లు జారీపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు స్పందించారు. రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకొనేలా పరిస్థితులను సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఎంపీలు సౌగతా రాయ్, కల్యాణ్ బెనర్జీ అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాయడం చట్టవిరుద్ధమని తెలిపారు. సీఎస్, డీజీపీలకు సమన్లు జారీచేయడం సమంజసం కాదన్నారు.
బెంగాల్‌లో గూండా రాజ్యం: నడ్డా
తన వాహన శ్రేణిపై జరిగిన దాడిపై జేపీ నడ్డా తీవ్రంగానే స్పందించారు. బెంగాల్ పూర్తిగా అన్యాయమైన, గూండా రాజ్యంలోకి జారిపోయిందని మండిపడ్డారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం నిరాశకు ఇదో నిదర్శనంగా కనబడుతోందని వ్యాఖ్యానించారు.
నిప్పుతో చెలగాటమా?: గవర్నర్
నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఖండించారు. రాష్ట్రంలో రోజురోజుకీ శాంతిభద్రతల పరిస్థితి దిగజారుతోందన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమన్న ధన్కర్.. మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పాలన్నారు. శాంతి భద్రతల విషయంలో సీఎం నిప్పుతో చెలగాటమాడొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన విధి అన్న ఆయన.. సీఎం మమత కూడా రాజ్యాంగాన్ని అనుసరించాలని సూచించారు.