బైపాస్‌ రోడ్డులో ల్యాండ్‌ బ్యాంక్‌ 

పరిశ్రమల కోసం ముందస్తు ప్లాన్‌
మహబూబ్‌నగర్‌,మే10(జ‌నం సాక్షి): మహబూబ్‌నగర్‌  బైపాస్‌రోడ్డు, హైవే మధ్య 600 ఎకరాల్లో పలు పరిశ్రమలు నెలకొల్పేందుకు భూమి సేకరించి ఒక ల్యాండ్‌ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు.  భవిష్యత్తులో మహబూబ్‌నగర్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పరిశ్రమలు పెట్టాలనుకున్న వారికి తక్షణం భూమి ఇవ్వడం ద్వారా సమస్య ఉండదని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్‌ గతంలో వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు ఒకే ప్రధాన రహదారి ఉందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు నాయకులు అభివృద్ధిని ఒర్వలేక భూములు కొల్పోతున్న వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని  ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో
కేవలం ఒకే ప్రదాన రోడ్డు ఉండడంతో వాహనదారులకు, ప్రజలు గత 40 ఏళ్ల నుండి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. బైపాస్‌ రోడ్డు కావాలంటూ ప్రజలు ఎందరినో ఆశ్రయించిన ఫలితం దక్కలేదు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ మహబూబ్‌ నగర్‌పై కనికరం చూపడమే కాకుండా 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుండి ఎంపిగా పోటీ చేసి గెలిచిన సమయంలో అప్పుడే బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ప్రజలకు హావిూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యేకంగా ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఏకంగా రూ.92కోట్లకుపైగా నిధులు మంజూరు చేయించారు. భూసేకరణ విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురుకావడంతో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ ప్రత్యేక చొరవ తీసుకుని నిర్వాసితులతో పలుమార్లు చర్చలు జరిపి వారితో ఒకే అనిపించుకునేలా వ్యూహాలకు పదునుపెట్టారు. దీంతో పాటు ఇక్కడ భూ బ్యాంక్‌ ఏర్పాటుకు కూడా యత్నిస్తున్నారు.