బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులతో సమావేశాలు
ఆదిలాబాద్,ఫిబ్రవరి20( జనంసాక్షి) : బొగ్గు ఉత్పత్తిలో నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి అధికారులు అన్నారు. బొగ్గు వెలికితీతలో ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని యంత్రాలను, కార్మికుల సామర్ద్యాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటేనే సింగరేణికి మనుగడ ఉంటుందని అన్నారు. ఏటా యాజమాన్యం నిర్దేశిరచిన లక్ష్యాలను అధిగమించాలంటే కార్మికులు, అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రస్తుతం సంస్థలో నెలకున్న పరిస్థితులను కార్మికులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలనే ఉద్దేశంతో సీఎండీ ఎండి మల్టీ డిపార్టుమెంట్ కమిటీలను ఏర్పాటు చేశారని వివరించారు. సింగరేణిలోని అన్ని భూగర్భ గనులు నష్టాల్లో నడుస్తున్నాయన్నారు. ఇది ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో కంపెనీ అభివృద్ధి కష్టసాధ్యమవుతుందన్నారు. కంపెనీకి ఎదురయ్యే సమస్యల నుంచి సంస్థను కాపాడుకోవాలంటే కార్మికులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కంపెనీలో బొగ్గు ఉత్పత్తి బాగా జరపడానికి అన్నీ విభాగాల సిబ్బంది, అధికారులు పరోక్షంగా సహకారం అందిస్తారని తెలిపారు. బుల్లితెరపై సింగరేణి కంపెనీలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, లాభనష్టాలు, యంత్రాల వినియోగం, సిబ్బంది, అధికారుల పనిగంటల గురించి వివరాలను ప్రదర్శించారు.