బొగ్గు ధరలను పెంచిన కోల్‌ఇండియా

కోల్‌కతా, జనవరి9(జ‌నంసాక్షి ) : ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ, ప్రభుత్వ రంగ కోల్‌ ఇండియా వంటేతర బొగ్గు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ధరల పెంపునకు బోర్డు ఆమోదం తెలిపినట్లు సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. సగటు ధరపై 10శాతం పెంచినట్లు కోల్‌ఇండియా వర్గాల సమాచారం. ధరల పెంపు వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి తైమ్రాసికంలో కంపెనీకి రూ.1,956కోట్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు రెగ్యులేటరీ రైలింగ్‌ సందర్భంగా కోల్‌ఇండియా తెలిపింది. అంతేగాక, కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.6,421కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది. కోల్‌ఇండియా అన్ని అనుబంధ సంస్థలకూ ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. గత కొన్ని నెలలుగా నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలు, పన్నులు పెరగడంతో ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చెబుతోంది. కాగా.. ధరల పెంపు నేపథ్యంలో ఎక్స్చేంజీల్లో కోల్‌ఇండియా షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేరు విలువ 5శాతం చొప్పున పెరిగి ధర రూ.303గా ట్రేడ్‌ అవుతోంది.