బొలెరో బోల్తా

గద్వాల, జనవరి 8: అదుపుతప్పిన బొలెరో వాహనం బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా 27మందికి గాయాలైన సంఘటన సోమవారం గద్వాల మండల పరిధిలో చోటు చేసుకుంది. మృతులను ఎమునోనిపల్లికి చెందిన అరుణ (18) చిన్నపాడుకు చెందిన వెంకటన్న (40), లోగింద ఆచారి (35), గీతమ్మ (35), వెంకటన్న (35)లుగా గుర్తించారు. ధరూర్ మండలం చిన్నపాడు, ఎమునోనిపల్లి గ్రామానికి చెందిన కూలీలు గద్వాల సమీపంలోని పత్తిమిల్లులో కూలిపనులు చేస్తుంటారు. ఆదివారం, సోమవారం మిల్లులో పనిచేసిన కూలీలు, తెల్లవారుజామున ఏపీ 05టీఏ 3265 వాహనంలో స్వగ్రామాలకు బయలుదేరారు. డ్రైవర్ రాముడు సుమారు 41మంది కూలీలను ఎక్కించుకొని వెళ్తుండగా, గోనుపాడు గ్రామ శివారులోని పారుచర్ల గ్రామ స్టేజి సమీపంలో గద్వాల, ధరూర్ ప్రధాన రహదారిపై వాహనం అదుపుతప్పి పంట పొల్లాలోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరి కొందరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గద్వాల డీఎస్పీ సురేందర్‌రావు, సీఐ వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై అంజాద్ ఆలీ, ధరూర్ ఎస్సై మురళీగౌడ్‌లు సహాయక చర్యలు నిర్వహించారు. రహదారిపై
ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదంలో చిన్నపాడు గ్రామానికి చెందిన 20 మంది, ఎమునోనిపల్లికి చెందిన 7గురు గాయపడ్డారు. 14 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రికి తరలించగా, 13మంది కూలీలు గద్వాల ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
బంధువుల ఆందోళన
మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గద్వాల, రాయచూర్ అంతర్ రాష్ట్ర రహదారిపై బైఠాయించి న్యాయం చేసేంతవరకు మృతదేహాలు పోస్టుమార్టానికి తరలించొద్దని ఆందోళనకు దిగారు. రహదారిపై ఎలాంటి అంతరాయం కలగకుండా సీఐ వెంకటేశ్వర్లు, గద్వాల రూరల్ ఎస్సై అంజాద్ అలీ, ధరూర్ ఎస్సై మురళీగౌడ్ పర్యవేక్షించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుల కుటుంబీకులతో మాట్లాడి పరిహారం ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలపడంతో మృతదేహాలను గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి, మాజీ ఎమ్మెల్యే డికె భరతసింహారెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సందర్శించి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు.