బోగస్ విద్యాసంస్థలను ఏరిపారేయండి
– పేదవిద్యార్థులకు ఉన్నతవిద్య అందించాలి
– ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లిచండి
– సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్,ఏప్రిల్ 7(జనంసాక్షి):పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు తదితర ఉన్నత స్థాయి అవకాశాలు పొందాలన్నదే తమ అభిమతమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం పెట్టే ఖర్చు అక్రమార్కుల పాలు కావడం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటి దాకా విద్యార్థులకు బకాయి పడిన రూ. 3,061 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లింపు, తదితర విద్యావిషయక అంశాలపై ముఖ్యమంత్రి సవిూక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఇతర కులాల్లోని పేదలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు, మధ్యాహ్న భోజనానికి ఇప్పటికే అందిస్తున్న సన్నబియ్యం పథకాన్ని వచ్చే ఏడాది నుంచి కాలేజ్ , యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పేదలకు మంచి భోజనం, బట్టలు, పుస్తకాలు అందించడానికి ఫీజు రీ ఎంబర్స్ మెంట్, మెస్ చార్జీలు చెల్లించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నదని వెల్లడించారు.పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు తదితర ఉన్నత స్థాయి అవకాశాలు పొందాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. ఇందుకోసమే ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. అయితే ఇదే సందర్భంలో కొన్ని బోగస్ విద్యాసంస్థలు ప్రభుత్వ సొమ్మును కాజేయాలనే ఉద్దేశ్యంతో అక్రమాలకు పాల్పడుతున్న విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు.ప్రభుత్వం పెట్టే ఖర్చు అక్రమార్కుల పాలు కావడం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సీఐడీ, విజిలెన్స్, ఏసీబీ, ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా అనేక అక్రమాలు బయటపడ్డాయని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక విద్యాసంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లేదని, బోగస్ విద్యాసంస్థలున్నాయని దీని వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే హక్కు కోల్పోతున్నారని వివిధ విచారణల్లో తేలిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు పూర్తి స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడం కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ బృందాలను చేసి, రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటిలో తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఏది బోగస్ సంస్థో, ఏది అసలు సంస్థో తేల్చాలని చెప్పారు. విద్యాసంస్థల్లో అద్యాపకులు ఉన్నారా? ఫర్నిచర్ ఉందా? ఇతర సౌకర్యాలున్నాయా? లేబరేటరీలున్నాయా? అందులో ఉన్నవి అబద్దపు అడ్మిషన్లా? నిజమైన అడ్మిషన్లా? తదితర విషయాలపై సమగ్ర విచారణ చేయాలన్నారు. ప్రభుత్వ గుర్తింపుకు నిర్దేశించిన అర్హతలు, ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అనే విషయాలను కూడా గమనించాలని కోరారు. విజిలెన్స్ విచారణలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని వాటి గుర్తింపును రద్దు చేస్తామని కూడా సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో బోగస్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఎంతమాత్రం నష్టం కలగకుండా కూడా చర్యలు తీసుకుంటామని వారిని మరో విద్యాసంస్థల్లో చేరుస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.




