బోణీకొట్టిన టీమిండియా

– తొలివన్డేలో కివీస్‌కు తప్పని ఘోరపరాభవం
– 8వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం
– రాణించిన ధావన్‌, కోహ్లీ
– 156 పరుగులకే కివీస్‌ను కుప్పకూల్చిన భారత్‌ బౌలర్లు
నేపియర్‌, జనవరి23(జ‌నంసాక్షి) : భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లీ సేన బోణీ కొట్టింది. బుధవారం నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌  38ఓవర్లలో 156 పరుగులకే చేయగలిగింది. భారత్‌ బౌలర్లు ఎదురుదాడితో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌ బాటపట్టారు.. కాగా అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా కేవలం 34.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
కుప్పకూలిన కివీస్‌..
తొలుత కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే తొలి ఐదు ఓవర్లలోనే ఆతిథ్య జట్టు ఓపెనర్లను కోల్పోయింది. షవిూ వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి గప్తిల్‌ (5) ఔటవగా.. నాలుగో ఓవర్‌ మూడో బంతికి మన్రో (8) వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ క్రీజులో నిలదొక్కుకున్నాడు. రాస్‌ టేలర్‌తో కలిసి స్కోరు బోర్డును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని చాహల్‌ వీడదీశాడు. చాహల్‌ వేసిన 15వ ఓవర్‌లో టేలర్‌ అతనికే క్యాచ్‌ వెనుదిరిగాడు. దీంతో విలియమ్సన్‌-టేలర్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన లాథమ్‌, నికోలస్‌, శాంట్నర్‌ సైతం తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. మరోవైపు కెప్టెన్‌ విలియమ్సన్‌ ఒంటరిపోరాటం చేశాడు. ఈ క్రమంలో విలియమ్సన్‌ అర్ధశతకం నమోదు చేశాడు. వన్డేల్లో అతడికి ఇది 36వ అర్ధశతకం. అయితే 34వ ఓవర్‌లో 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్‌ను కుల్‌దీప్‌ పెవిలియన్‌కు పంపించాడు. విలియమ్సన్‌(64). రాస్‌ టేలర్‌(24) మినహా కివీస్‌ ఆటగాళ్లు ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. దీంతో 38 ఓవర్లలో న్యూజిలాండ్‌ 157 పరుగులకే ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ 4, చాహల్‌ 3, షవిూ 2 వికెట్లు పడగొట్టగా కేదార్‌ జాదవ్‌ ఒక వికెట్‌ తీశాడు.
అలవోకగా లక్ష్యాన్ని చేధించిన భారత్‌..
కివీస్‌ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని 34.4 ఓవర్లలోనే ఛేదించింది. భోజన విరామం తర్వాత మైదానంలోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్‌ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలను తట్టుకోలేకపోయారు. ఫలితంగా మ్యాచ్‌ను 30 నిమిషాలు పాటు నిలిపి వేశారు. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించి టీమిండియాకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ధావన్‌ అర్ధశతకం చేయడంతో ఛేదనలో టీమిండియా పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. భోజన విరామానికి ముందు దూకుడుగా ఆడిన టీమిండియా.. బ్రేక్‌ అనంతరం ఓపెనర్‌ వికెట్‌ కోల్పోయింది. పదో ఓవర్‌లో బ్రేస్‌వెల్‌ వేసిన రెండో బంతికి రోహిత్‌ శర్మ.. గప్తిల్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చి కెప్టెన్‌ విరాట్‌ తోడుగా ధావన్‌ రెచ్చిపోయి ఆడాడు. ఇద్దరూ కలిసి బౌండరీలు బాదారు. కివీస్‌ బౌలర్లతో ఆటాడుకున్నారు. విరాట్‌- ధావన్‌ జోడీ కలిసి జట్టుకు 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధశతకం చేసేలా కనిపించాడు. అయితే 29 ఓవర్లో కోహ్లీని లాకియా ఫెర్గూసన్‌ పెవిలియన్‌
చేర్చాడు. 29ఓవర్‌ లాకియా వేసిన నాలుగో బంతిని ఆడిన కోహ్లీ(45).. లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే అప్పటికి టీమిండియా విజయానికి 20 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు(13)తో కలిసి ధావన్‌(75) స్కోరు బోర్డును పరుగులు పెట్టించి 24 పరుగుల అజేయ భాగస్వామ్యంతో టీమిండియాకు విజయాన్ని అందించారు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
వెలుతూరు ఎక్కువవ్వడంతో మ్యాచ్‌ నిలిపివేత..
సూరీడి కారణంగా మ్యాచ్‌ ఆగిపోవడం ఎప్పుడైనా చూశారా? భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే ఈ కారణంగానే ఆగిపోయింది. ఎండ తీవ్రత కారణంగా బంతిని సరిగా గుర్తించడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమైంది. దీంతో దావన్‌ అపైర్‌లకు ఫిర్యాదు చేయడంతో మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా మ్యాచ్‌ను కాసేపు నిలిపేశారు. ఆటగాళ్ల భద్రత, వడదెబ్బ తగిలే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఫీల్డ్‌ అంపైర్‌ షాన్‌ జార్జ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. భానుడు భగభగలాడుతూ.. సూర్య కిరణాలు ఆటగాళ్ల కళ్లలోకి పడుతుండటంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం గమనించిన అంపైర్లు కాసేపు మ్యాచ్‌ నిలిపేశారు. గతంలో దేశవాళీ క్రికెట్లో మాత్రమే ఎండ తీవ్రత కారణంగా మ్యాచ్‌లను నిలిపేసిన ఘటనలు ఉన్నాయి. సూర్య కిరణాలు నేరుగా బ్యాట్స్‌మెన్‌ కళ్లలో పడకుండా ఉండటం కోసం పిచ్‌లను ఉత్తరం-దక్షిణ దిశల్లో రూపొందిస్తారు. కానీ తొలి వన్డే జరిగిన మెక్‌లీన్‌ పార్కులో పిచ్‌ తూర్పు-పడమర దిశల్లో ఉంది. దీంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు.